
భారత్‌లో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య రోడ్లపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకర సమయమని ‘జూనో జనరల్ ఇన్సూరెన్స్’ విడుదల చేసిన ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్–2026 (IRSR) వెల్లడించింది. దేశవ్యాప్తంగా డ్రైవర్ల ప్రవర్తన, డ్రైవింగ్ అలవాట్లపై నిర్వహించిన విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. రాత్రి 8 గంటల తర్వాత డ్రైవర్ల సగటు డ్రైవింగ్ స్కోర్ గణనీయంగా తగ్గిపోతుండటంతో, మధ్యాహ్నంతో పోలిస్తే రాత్రి వేళ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. మరోవైపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయం రోజులో అత్యంత సురక్షితమైన డ్రైవింగ్ సమయంగా గుర్తించింది.
జూనో సంస్థ రూపొందించిన ‘స్మార్ట్‌డ్రైవ్’ యాప్ ద్వారా సేకరించిన టెలిమెట్రీ డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన సుమారు 45 లక్షల ప్రయాణాలు, 55 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటాను విశ్లేషించారు. ప్రమాదాల ముప్పు కేవలం రహదారుల పరిస్థితులు లేదా జనాభా సాంద్రతపై మాత్రమే కాకుండా, 80 శాతానికి పైగా డ్రైవర్ల ప్రవర్తన, డ్రైవింగ్ తీరుపై ఆధారపడి ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. డ్రైవింగ్ విషయంలో మహిళలు, పురుషుల మధ్య పెద్దగా తేడా లేదని కూడా నివేదిక తెలిపింది. మహిళా డ్రైవర్ల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 శాతం ఉండగా, పురుషులది 92.43 శాతంగా నమోదైంది. దీంతో మహిళలు ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాలకు ఈ నివేదిక చెక్ పెట్టింది.
భారతీయ డ్రైవర్లలో అత్యంత బలహీనమైన అంశంగా అవసరమైన సమయంలో సకాలంలో బ్రేక్ వేయకపోవడం గుర్తించారు. దీనికి 87 స్కోర్ మాత్రమే నమోదైంది. అలాగే అధిక వేగంతో ప్రయాణిస్తూ ఆకస్మికంగా వేగాన్ని మరింత పెంచడం కూడా ప్రధాన ప్రమాదకర అలవాటుగా తేలింది. అయితే వర్షాకాలం, శీతాకాలంలో పొగమంచు వంటి వాతావరణ మార్పులు మొత్తం డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని నివేదిక పేర్కొంది. భారత్‌లో ప్రతి ఏడాది సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా, ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాల్లో భారతదేశం వాటా 11 శాతంగా ఉంది. ఈ ప్రమాదాల కారణంగా దేశ జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారని పేర్కొంది.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి