
సిటీలో ఇల్లు లేదా రూమ్ రెంట్‌కి తీసుకుని ఉండేవాళ్లు ఫర్నిచర్ కొనాలంటే కాస్త ఆలోచిస్తుంటారు. సోఫాలు, వార్డ్‌రోబ్‌లు, స్టడీ టేబుల్స్, డైనింగ్ సెట్‌లు.. వంటి ఫర్నిచర్ కొనడానికి త్వరగా ఇంట్రెస్ట్ చూపించరు. వాటిని మాటిమాటికీ షిఫ్ట్ చేయాల్సి రావడం కూడా ఒక కారణం అయితే.. అవన్నీ కొనాలంటే బోలెండ ఖర్చు. ఆ సమస్యకు చెక్ పెట్టేలా సిటీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్య ఫర్నిచర్ కూడా అద్దెకు తీసుకుంటున్నారు.
ఐటీ కారిడార్‌లో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అద్దెకు ఇచ్చే పలు సంస్థలు వెలిశాయి. ఇక్కడ బెడ్, సోఫా, డైనింగ్ టేబుల్, వార్డ్ రోబ్, స్టడీ టేబుల్స్ వంటి ఫర్నిచర్‌తో పాటు అప్లయెన్సెస్ కూడా అద్దెకు దొరుకుతున్నాయి. ఇందులో నెలవారీ ప్లాన్లు, డెలివరీ, మెయింటెనెన్స్ సౌకర్యాలు ఉన్నాయి. ఐటీ ఉద్యోగులకు అద్దె ఫర్నిచర్ వల్ల ఇల్లు మార్చినప్పుడు ఫర్నిచర్ తరలింపు ఇబ్బందులు తగ్గుతాయంటున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తిగా ఫర్నిష్డ్ హోమ్ సెటప్ పొందవచ్చంటున్నారు. ఫర్నిచర్ మెయింటెనెన్స్, రిపేర్ బాధ్యతలు సాధారణంగా రెంటల్ కంపెనీలవే కావడం విశేషం.
రెంటల్ ఫర్నిచర్ సంస్థలెన్నో..
ఫర్నిచర్ అద్దెకు ఇవ్వడంలో ఫుర్ లెంకో పార్ట్ నర్ స్టోర్, సిటీ ఫర్నిష్, ఆర్ఎస్ ఫర్నిచర్, రెంట్ మోజో, రెంట్ మచా, రెంట్ ఓ రెంట్, ఫర్నిష్ రెంట్, ఫేమస్ టెంట్ హౌస్, పే రెంట్ జడ్, యూనిక్ పాప్ అండ్ డెకార్స్ సంస్థలు ముందున్నాయి. రెంట్ మోజో సర్వీస్ అయితే ఏసీ, ఫ్రిడ్జ్, ఎయిర్ ఫ్యూరిఫైర్, బాల్కనీ ఫర్నిచర్, అప్లయన్సెస్ కాంబో ప్యాక్ అందిస్తుంది. ఫర్నిచర్ రెంట్‌కు ఇచ్చే పలు సంస్థలు సిటీ కస్టమర్లకు సర్వీస్ చేసేందుకు పోటీపడుతున్నాయి.
ఫ్రీ డోర్‌స్టెప్ డెలివరీ
రెంటోమోజో ఫర్నిచర్.. కస్టమర్లు మంచాలు, సోఫాలు, డైనింగ్ సెట్‌లు, వార్డ్‌రోబ్‌లు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్‌లతో సహా ఇంటికి, ఆఫీస్‌కు అవసరమైన వస్తువులను కూడా తీసుకోవచ్చు. ఈ ప్లాన్ మూడు నెలల నుంచి మొదలు. ఇందులో ఫ్రీ డోర్‌స్టెప్ డెలివరీ, ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్, రీ– లోకేషన్ సపోర్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
టెంపరరీ ఆఫీస్‌లకు సూటబుల్
హోమీ ఫర్నిచర్ రెంటల్స్.. సోఫాలు, మంచాలు, వార్డ్‌రోబ్‌లు, టేబుళ్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు వంటి వస్తువులకే కెటలాగ్‌ను అందిస్తుంది. ‘‘ఎక్కువకాలం ఉండే అద్దెదారులకు ఇంటి దగ్గరకే డెలివరీ, ఇన్‌స్టాలేషన్, ఇబ్బంది లేని రిటర్న్‌లకు ప్రాధాన్యత ఇస్తుంద’’ని రెంటల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తనూజ తెలిపారు.
ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లే వ్యక్తులకు, టెంపరరీగా ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకునే స్టార్టప్‌లకు లేదా అద్దె అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లకు హోమీ సేవలు ప్రత్యేకంగా ఉంటాయని అన్నారామె. సిటీలో ఎక్కువగా అద్దెకు తీసుకునే వాటిలో వార్డ్‌రోబ్‌లు, స్టడీ టేబుల్స్, డైనింగ్ సెట్‌లు ముందువరుసలో ఉన్నాయి.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్‌లోని పలు కుటుంబాలు నెలకు రూ.60 వేల పూర్తిస్థాయి ఫర్నిష్డ్ సెటప్‌ల నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ.2,499 బండిల్ ప్లాన్‌లకు మారుతున్నాయి.
అద్దె ఫర్నిచర్ ప్లాన్ ఎందుకంటే..
సొంత ఫర్నిచర్‌ను ఒకచోట నుంచి మరో చోటుకి తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదు. దాన్ని విడదీయడం, రవాణా చేయడం, తిరిగి అమర్చడం వంటి ఖర్చులు.. లేదా త్వరగా తిరిగి అమ్మినప్పుడు వచ్చే నష్టాన్ని భరించడం.. పూర్తిగా అద్దెదారుపైనే పడుతుంది. ఈ భారాన్ని అద్దె ఫర్నిచర్ తగ్గిస్తుంది. అద్దె ప్లాన్‌లలో ఫర్నిచర్ డెలివరీ, దానిని అమర్చడం, సిటీలోపల ఫ్రీగా షిఫ్ట్ చేయడం వంటివి కలిపి ఉంటాయి.
ఉపయోగం ఏంటంటే..
హైదరాబాద్‌లోని అద్దెదారుల్లో ఎక్కువ శాతం మంది ప్రాజెక్ట్ పోస్టింగ్‌లు, అసైన్‌మెంట్ లేదా మొదటి ఉద్యోగాలపై వస్తారు. వాళ్ల సమయం రెండు నుంచి మూడు ఏండ్లలోపే ఉంటుంది. కొత్తగా కొన్న వార్డ్‌రోబ్, స్టడీ టేబుల్, డైనింగ్ సెట్‌కు డెలివరీ, అసెంబ్లింగ్ వంటివి లెక్కలోకి తీసుకోకముందే దాదాపు రూ.60,000 వరకు ఖర్చవుతుంది.
ఒకసారి అద్దెదారు వేరే చోటికి మారిన తర్వాత, సెకండ్ హ్యాండ్ ప్లాట్‌ఫామ్‌లలో ఫర్నిచర్ తిరిగి అమ్మినప్పుడు ఆ మొత్తంలో కొంత భాగం కూడా రాబట్టలేరు.