Reading Time: 2 minutes
Stainless Steel Railing Cleaning Tips Easy Home Remedies To Make Railings Shine Like New

Stainless Steel Railing Cleaning Tips: ఇంటి అందాన్ని పెంచే స్టెయిన్‌లెస్ స్టీల్ రెయిలింగ్‌లు కాలక్రమేణా దుమ్ము, నీటి మరకలు, వేలిముద్రలు, జిడ్డు కారణంగా తమ సహజ మెరుపును కోల్పోతాయి. దీనికి ప్రధాన కారణం.. ఇంటికి వచ్చే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో వాటిని తాకడం.. పట్టుకొని నడవడంతో చేతులకు ఉన్న మరకరలు.. వాటికి.. వాటికి ఉన్న దుమ్ము చేతులకు అంటడం చూస్తుంటాం.. అయితే, వీటిపై ఏర్పడే మరకలు ఇబ్బంది కరంగా మారతాయి.. దీంతో, చాలామంది వాటిని శుభ్రం చేయడానికి ఖరీదైన రసాయన క్లీనర్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని సహజ పదార్థాలతో ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండానే స్టీల్ రెయిలింగ్‌లను కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు.

గోరువెచ్చని నీరు, మైక్రోఫైబర్ గుడ్డతో శుభ్రపరచండి

రెయిలింగ్‌పై కేవలం దుమ్ము లేదా తేలికపాటి మురికి మాత్రమే ఉంటే, గోరువెచ్చని నీటిలో మైక్రోఫైబర్ గుడ్డను ముంచి బాగా పిండాలి. ఆ గుడ్డతో రెయిలింగ్‌ను మెల్లగా తుడవాలి. అనంతరం పొడి గుడ్డతో మరోసారి తుడిస్తే నీటి మరకలు లేకుండా శుభ్రంగా కనిపిస్తుంది.

తెల్ల వెనిగర్‌తో మొండి మరకలకు చెక్

నీటి మరకలు, వేలిముద్రలు లేదా మొండి మురికిని తొలగించడంలో తెల్ల వెనిగర్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సమాన మోతాదులో నీరు, వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని రెయిలింగ్‌పై స్ప్రే చేసి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మెత్తని గుడ్డతో తుడిస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి.

బేకింగ్ సోడాతో జిడ్డుకు పరిష్కారం

రెయిలింగ్‌పై జిడ్డు లేదా గట్టిగా పేరుకున్న మరకలు ఉంటే, బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేయాలి. దానిని మరకలపై రాసి పది నిమిషాల తర్వాత మెత్తటి స్పాంజ్‌తో శుభ్రం చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో తుడిచి పొడి గుడ్డతో ఆరబెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

నిమ్మరసంతో సహజ మెరుపు

నిమ్మకాయలో ఉండే సహజ ఆమ్ల గుణాలు స్టెయిన్‌లెస్ స్టీల్‌ను శుభ్రపరచడంతో పాటు మెరుపును కూడా తిరిగి తీసుకువస్తాయి. సగం నిమ్మకాయను రెయిలింగ్‌పై మెల్లగా రుద్ది, కొన్ని నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిస్తే రెయిలింగ్ శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో అదనపు షైన్

శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను మృదువైన గుడ్డపై వేసి రెయిలింగ్‌పై మెల్లగా రుద్దాలి. దీనివల్ల రెయిలింగ్‌పై పలుచని రక్షణ పొర ఏర్పడి మెరుపు పెరగడమే కాకుండా దుమ్ము త్వరగా పేరుకుపోకుండా కూడా సహాయపడుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

స్టీల్ రెయిలింగ్‌లను శుభ్రం చేసేటప్పుడు స్టీల్ వూల్ లేదా గరుకైన బ్రష్‌లను ఉపయోగించకూడదు. ఇవి ఉపరితలంపై గీతలు పడేలా చేస్తాయి. ఎల్లప్పుడూ మృదువైన గుడ్డ లేదా స్పాంజ్ మాత్రమే ఉపయోగించాలి. శుభ్రం చేసిన తర్వాత రెయిలింగ్‌ను పొడి గుడ్డతో తుడవడం వల్ల నీటి మరకలు ఏర్పడవు. వారానికి ఒకసారి తేలికగా శుభ్రం చేస్తే స్టెయిన్‌లెస్ స్టీల్ రెయిలింగ్‌లు చాలా కాలం పాటు కొత్తవాటిలా మెరిసిపోతాయి.