Reading Time: < 1 minute
Anantha Sriram Criticizes Kalki 2898 Ad Mahabharata Depiction Controversy

Anantha Sriram: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ గీత రచయిత అనంత శ్రీరామ్. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ ‘కల్కి 2898 AD’ లో పురాణ ఇతిహాసాల పాత్రలను చూపించిన తీరుపై ఆయన స్పందించిన విధానం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన సినిమాల్లో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛపై మాట్లాడుతూ.. పురాణాలను, ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు వాటి మూలాలను మార్చడం సరికాదని కుండబద్దలు కొట్టారు.

“ఇతిహాసాలు అంటే జరిగినది అలాగే చూపించాలి. ముఖ్యంగా మహాభారతంలోని అర్జునుడు – కర్ణుడు వంటి పవర్‌ఫుల్ పాత్రల విషయంలో చూపించిన కొన్ని మార్పులు సరైనవి కావు” అని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచారు. కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను ఎలివేట్ చేసిన విధానంపై గతంలోనూ భిన్నమైన చర్చలు జరగ్గా.. అనంత శ్రీరామ్ కామెంట్స్‌తో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ పడే ఇబ్బందులు, కమర్షియల్ విలువలపై ఆయన మరింత ఘాటుగా స్పందించారు. “డబ్బులు ఇస్తే సినిమాకు పాటలు, మాటలు రాస్తాను కానీ.. ఇతిహాసాల మూలాలను మార్చేసే కొన్ని తప్పుడు మార్పులకు మాత్రం నేను ఎట్టిపరిస్థితుల్లోనూ కలం పట్టను” అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చరిత్రను, పురాణాలను వక్రీకరించడాన్ని తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అనంత శ్రీరామ్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.