Reading Time: < 1 minute
హే.. షెపీ నువ్వేనా? అదరగొట్టేశావ్‌గా.. మరి ఐపీఎల్‌లో ఏమైంది? RCB ప్లేయర్ మాస్ కంబ్యాక్

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండో సార్లు కప్పు కొట్టి అదరగొట్టింది. 2024 సీజన్ ముగిసిన తర్వాత ఒక్క కప్పు కూడా లేని ఆర్సీబీ.. 2026 సీజన్ ముగిశాక ఏకంగా రెండు కప్పులున్న టీమ్‌గా అవతరించింది. అయితే 2025 సీజన్‌లో కప్పు గెలిచిన కోర్ టీమ్‌ను కొనసాగిస్తూ రెండో సారి కూడా ఛాంపియన్ అయింది. అయితే 2025లో అద్భుతంగా ఆడి, 2026లో ఆశించిన స్థాయిలో రాణించని ప్లేయర్ ఒకరు ఉన్నారు ఆర్సీబీలో. అతనే రొమారియో షెపర్డ్.

గత సీజన్‌లో ఒక్క ఇన్సింగ్స్‌‌తో అదరగొట్టిన రొమారియో.. ఈ సీజన్‌లో మాత్రం అంతగా రాణించలేదు. బౌలింగ్‌లో అయితే దారుణంగా విఫలం అయ్యాడు. 15 మ్యాచ్‌లు ఆడిన రొమారియో కేవలం 7 వికెట్లు తీసుకున్నాడు. పైగా అతని ఎకానమీ దారుణంగా ఉంది. 11.92 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అయినా కూడా ఆర్సీబీ అతనిపై నమ్మకంతో బ్యాక్ చేసుకుంటూనే వచ్చింది. జట్టులోని మిగతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చాలా సందర్భాల్లో రొమారియో వైఫల్యం అంతగా జట్టుపై ప్రభావం చూపించలేదు.

అయితే అదే రొమారియో షెపర్డ్ తాజాగా అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేసి.. కేవలం 5 అంటే 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అతను వేసిన నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడెన్‌గా ఉండటం విశేషం. ఆర్సీబీ తరఫున 11.92 ఎకానమీతో బౌలింగ్ చేసిన రొమారియో.. ఈ మ్యాచ్‌లో కేవలం 1.25 రికార్డు ఎకానమీతో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ బౌలింగ్ చూసి.. ఆర్సీబీ ఫ్యాన్స్ హే.. షెపీ(షెపర్డ్) ఇది నువ్వేనా? అంటూ షాక్ అవుతున్నారు. ఇదే బౌలింగ్ ఐపీఎల్‌లో కూడా వేసి ఉంటే బాగుండేది కదా అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. సర్లే.. వచ్చే సీజన్‌లో ఇలాగే వేయి.. హ్యాట్రిక్ కప్పులు కొడదాం అంటూ మరికొందరు సోషల్ మీడియాలో షెపర్డ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి