Reading Time: < 1 minute
Mdmk Quits Dmk Alliance After 9 Years Big Political Setback For Mk Stalin

DMK: తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిదేళ్లుగా డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, తాము కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించింది. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఎంకేలో కొనసాగడం సాధ్యం కావడం లేదని, తమ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తోందని ఎండీఎంకే ఆరోపించింది. ఇదే కాకుండా, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చేలా రహస్య ప్రణాళిక అమలు చేస్తున్న పరిస్థితుల్లో డీఎంకేతో కొనసాగలేమని చెప్పింది.

ఇదిలా ఉంటే, తమిళనాడులో అధికారంలో ఉన్న సీఎం విజయ్‌కు చెందిన టీవీకే పార్టీతో జత కడుతున్నట్లు ఎండీఎంకే చెప్పలేదు. కానీ ఇటీవల, ఫ్లోర్ టెస్ట్ సందర్భంలో ఎండీఎంకే పార్టీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే పరోక్షంగా టీవీకేకు సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సీఎం విజయ్‌తో వైకో, ఆయన కుమారుడు దురై వైకో భేటీ అవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎండీఎంకే అధినేత వైకో ఒకప్పుడు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి అత్యంత సన్నిహితుడు. 1993లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, పలుమార్లు డీఎంకేతో పొత్తు కలుస్తూ, విడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మరోసారి డీఎంకేతో స్నేహానికి గుడ్ బై చెప్పారు.

ఇదిలా ఉంటే, ఈ మొత్తం పరిణామంలో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఎండీఎంకేకు అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిద్దరు కూడా డీఎంకే గుర్తుపై గెలిచారు. ఎండీఎంకే కూటమి నుంచి వెళ్లిపోయినప్పటికీ, ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేశారు. ఇటీవల వీరిద్దరు ఎండీఎంకే పార్టీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఒక వేళ టీవీకేతో జత కట్టినా, ఇప్పటికిప్పుడు విజయ్ ప్రభుత్వానికి సంఖ్యా బలం పెరిగే అవకాశం లేదు. ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీలు అధికార టీవీకే కూటమికి దగ్గరయ్యాయి. ఒకప్పుడు వీరంతా డీఎంకే కూటమిలో సభ్యులుగా ఉండే వారు.