Reading Time: 2 minutes
Telangana Pulse Polio Drive June 28

Pulse Polio: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ (జూన్ 28) నుంచి ప్రారంభం కానున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఒక్కరు కూడా మిగిలిపోకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

నాలుగు రోజులు పల్స్ పోలియో.. ప్రత్యేక ప్రాంతాలపై నజర్

జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లు, ఆ తర్వాత జూన్ 29, 30 తేదీల్లో సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని అధికారులు మంత్రికి వివరించారు. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉన్నందున.. అక్కడ జూలై 1న అదనంగా మరో రోజు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, , గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదైందని, పోలియో రహిత హోదాను ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించామని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు.

భారీగా పోలియో బూత్‌లు, సిబ్బంది మోహరింపు

ఈ భారీ వైద్య కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లను సిద్ధం చేశారు. సుమారు 40.97 lakhs (40.97 లక్షల) మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో, అందుకోసం సుమారు 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులను ఇప్పటికే జిల్లాలకు సరఫరా చేశారు. ఈ బృహత్తర కార్యం కోసం క్షేత్రస్థాయిలో 8,393 మంది ఏఎన్‌ఎంలు, 27,181 మంది ఆశా కార్యకర్తలు, 34,442 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని సేవలు అందించనున్నారు.

తల్లిదండ్రులకు మంత్రి పిలుపు

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలని కోరారు. గతంలో ఒకవేళ పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ఈ విడతలో మరోసారి వేయించడం వల్లే పిల్లలకు పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించాలని, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరూ సహకరించి తెలంగాణతో పాటు దేశం పోలియో రహిత హోదాను ఇలాగే కొనసాగిద్దామని మంత్రి ఆకాంక్షించారు.