
పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఎంతో వైభవంగా జరగాల్సిన వేడుక.. కానీ, అది కాస్తా పుణెలోనే అత్యంత దారుణమైన హత్య కేసుగా మారిపోయింది. ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకూ నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ దారుణానికి కారణం ప్రతీకారం కాదు, డబ్బు అంతకంటే కాదు, కేవలం సమయం మాత్రమేనని పోలీసులు చెబుతుండటం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
మూడేళ్ల సమయం కోసమా?
పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితురాలు సీయా గోయల్ చెప్పిన సమాధానం విని అధికారులు సైతం ముక్కున వేలేసుకున్నారు. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని.. ఒకవేళ అతను చనిపోతే, ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం రాకముందే తనకు కనీసం మరో మూడేళ్ల సమయం దొరుకుతుందని సీయా పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అటు ప్రియుడు చేతన్ చౌదరి కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందు మరో 2 నుండి 3 ఏళ్ల టైమ్ కావాలని కోరుకున్నాడట. పెద్దలు కుదిర్చిన పెళ్లిని రద్దు చేసుకుని, సమాజంలో అవమానం పడేకంటే.. కేతన్‌ను లేపేయడమే సులువైన మార్గమని ఈ కిరాతక జంట భావించింది.
నిశ్చితార్థానికి ముందే ఎఫైర్
నిజానికి సీయాకు, కేతన్‌తో 2026 ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. కానీ దానికి కొన్ని వారాల ముందే, అంటే 2026 జనవరిలోనే సీయా, చేతన్ ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐదు రోజుల పాటు గడిపారు. రాజస్థాన్‌కు చెందిన చేతన్, ఆ ట్రిప్‌లోనే సీయాకు మరింత దగ్గరయ్యాడు.
అయితే వీరిద్దరికి సీయా అన్నయ్య సాహిల్ గోయల్‌కు క్రికెట్ ద్వారా చేతన్ పరిచయం అయ్యాడు. సోదరుడితో కలిసి మ్యాచ్‌లకు వెళ్లినప్పుడే సీయా మొదటిసారి చేతన్‌ను కలిసింది. ఆ పరిచయం కాస్తా ఎంత గాఢమైన బంధంగా మారిందో వారి కాల్ డేటా చూస్తేనే అర్థమవుతోంది. జనవరి నుంచి వీరిద్దరూ ఏకంగా 2,004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. అంటే దాదాపు 238 గంటలు. హత్య కుట్రను ప్లాన్ చేయడానికి ఈ కాల్ రికార్డులే కీలక సాక్ష్యంగా మారబోతున్నాయి.
హత్యకు ముందురోజు ఏం జరిగింది?
కేతన్ మరణానికి సరిగ్గా ఒక రోజు ముందు, అంటే జూన్ 17వ తేదీ సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య.. పూణేలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న ఒక కేఫ్‌లో సీయా, చేతన్ కలుసుకున్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్‌లోనే హత్యకు సంబంధించిన పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డిజిటల్ ఆధారాల ధ్వంసం.. పోలీసుల నెక్స్ట్ స్టెప్
తాము దొరకకూడదని ఈ జంట చాలా తెలివిగా వ్యవహరించింది. నేరానికి ముందు, తర్వాత తమ మొబైల్ ఫోన్ల నుండి వాట్సాప్ చాట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేశారు. అంతటితో ఆగకుండా ఫోన్లలోని రీసైకిల్ బిన్‌లను కూడా ఖాళీ చేసి, డిజిటల్ ఆధారాలన్నీ చెరిపేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు ఈ డిలీట్ అయిన డేటాను రికవర్ చేసే పనిలో ఉన్నారు.
మరోవైపు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. చేతన్‌తో ఉన్న పరిచయంపై సీయా సోదరుడు సాహిల్ గోయల్‌ను శుక్రవారం దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ వెనుక ఉన్న పూర్తి నిజాలను రాబట్టేందుకు, సీయా కుటుంబంలోని మిగిలిన సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.