Reading Time: 2 minutes

ఇక నో టెన్షన్: హాస్పిటల్‌లో 2 గంటలున్నా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పక్కా.. IRDAI కొత్త రూల్స్

Caption of Image.

అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న గుండెల్లో ఒక్కసారిగా తూటాలాంటి నొప్పి, లేదా కిడ్నీ స్టోన్ కారణంగా పొట్టలో భరించలేనంత మంట. ప్రాణాలు పోతున్నంత పనై కళ్లల్లో నీళ్లతో ఎమర్జెన్సీ వార్డుకు పరుగులు తీస్తుంటాం. డాక్టర్లు మెరుపు వేగంతో స్పందించి.. చిన్న సర్జరీ లేదా అబ్జర్వేషన్‌లో ఉంచి ప్రాణాలు కాపాడతారు. అబ్బా.. బతికిపోయాం అనుకుంటూ డిశ్చార్జ్ అయ్యే టైమ్‌కి ఇన్సూరెన్స్ కంపెనీ పెద్ద షాక్ ఇస్తుంది. మీరు హాస్పిటల్‌లో 24 గంటలు లేరుగా.. అందుకే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నాం అంటూ చేతులెత్తేస్తుంది. ప్రాణం పోయే టైమ్‌లో టెక్నికాలిటీస్ మాట్లాడే ఈ దారుణమైన నిబంధనతో ఇన్నాళ్లూ లక్షలాది భారతీయ కుటుంబాలు జేబులు గుల్ల చేసుకున్నాయి. కానీ ఇకపై ఆ టెన్షన్లకు గుడ్ బై.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI సామాన్యుడి పక్షాన నిలబడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పేషెంట్లను వేధిస్తున్న ‘కచ్చితంగా 24 గంటలు అడ్మిట్ అవ్వాలి’ అనే మొండి రూల్‌ను పూర్తిగా తుడిచేసింది. ఆధునిక వైద్య సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో కేవలం 2 గంటలు హాస్పిటల్‌లో ఉండి చికిత్స పొందినా సరే.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త సవరణతో షార్ట్-స్టే కేర్, ఎమర్జెన్సీ అబ్జర్వేషన్, చిన్నపాటి డే-కేర్ ప్రొసీజర్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా ఆపకుండా డబ్బులు చెల్లించాల్సిందే.

ఒకప్పుడు క్యాటరాక్ట్, కిడ్నీ స్టోన్స్, అపెండిసైటిస్ వంటి ఆపరేషన్లకు రోజుల తరబడి హాస్పిటల్‌లో బెడ్‌పై పడుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లేజర్, ల్యాప్రోస్కోపీ పుణ్యమా అని గంటల్లోనే ట్రీట్‌మెంట్ ముగిసిపోతోంది. ఈ మెడికల్ అడ్వాన్స్‌మెంట్‌ను గుర్తించిన ఐఆర్‌డీఏఐ.. పాతకాలపు రూల్స్‌కు స్వస్తి పలికింది. ఈ నిర్ణయం వల్ల రోగులకు అటు హాస్పిటల్ బెడ్ ఛార్జీలు మిగలడమే కాకుండా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపు సున్నా అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ చేరే ప్రతి ఒక్కరికీ ఇదొక కొండంత అండ. ఇన్సూరెన్స్ రంగంలో ఇదొక గేమ్ ఛేంజర్ నిర్ణయమని, లక్షల మంది పాలసీదారులకు ఇది అసలైన పండగ లాంటి వార్త అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ మరింత సులభం కానుందని వారు అంటున్నారు. అయితే పాలసీ రూల్స్ పూర్తిగా పరిశీలించాకే ముందుకెళ్లటం బెటర్. 

©️ VIL Media Pvt Ltd.