
- వర్షాలు లేక పాడైపోయిన విత్తనాలు
- లబోదిబోమంటున్న రైతన్న
- సరిపడా వర్షాలు కురిసిన తర్వాతే విత్తుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు
ఆదిలాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవుతున్నాయి. అయితే కురిసిన ఒకటి, రెండు చిన్నపాటి వానలకే సంబురపడ్డ ఆదిలాబాద్ రైతులు కొద్ది రోజుల క్రితమే పత్తి విత్తనాలు వేసుకున్నారు. జూన్ రెండో వారం రాగానే ఎలాగైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, తాంసి, భీంపూర్, తలమడుగు, బోరజ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్, బోథ్ మండలాల్లోని 20 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు దుబ్బలోనే విత్తుకున్నారు.
తొలకరిత వర్షాలు కురుస్తాయని విత్తుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. జూన్ మొదటి వారంలో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తకుండానే పాడైపోయాయి. దీంతో మరోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైతులపై పెట్టుబడి భారం పడుతోంది.
4.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
ప్రస్తుతం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవవుతున్నాయి. అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట గాలిదుమారంతో మోస్తారు వర్షం కురుస్తోంది. భూమి తడిగా మారని ఈ వర్షాలు పంట సాగుకు అనుకూలం కాదు. అయితే ఈ ఏడాది తొలకరికే తొందరపడి చాలా మంది రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. పది రోజుల క్రితం దుబ్బలోనే పత్తి విత్తనాలు వేసిన రైతులు వర్షాలు పడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.
తప్పని పరిస్థితుల్లో కొంత మంది స్ప్రింకర్ల ద్వారా నీటిని అందిస్తూ మొక్కలకు జీవం పోసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 4.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇప్పటికే దాదాపు 20 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో విత్తనాలు విత్తుకోవడం మంచిది కాదని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తేమ శాతం ఉంటేనే వేయాలి
తేలికపాటి వర్షాలకే రైతులు తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొద్దిపాటి వర్షానికి విత్తనాలు మొలకెత్తినా ఆశించిన వర్షాలు పడితేనే మొలక ఎదిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలో కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే విత్తనాలు వేసుకోవాలని చెబుతున్నారు.
జూలై 15 వరకు పత్తి విత్తనాలు వేసుకోవచ్చని, వర్షాలు ఆలస్యమైతే పప్పు దినుసులు సాగు చేయాలంటున్నారు. తేలికపాటి వర్షాలు కురిసి 35 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతేనే సాగుకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
8 ఎకరాల్లో పత్తి విత్తుకున్నా..
తొలకరి వర్షానికి 8 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నాం. వర్షాలు ఆలస్యం కావడంతో చాలా మట్టుకు విత్తనాలు మొలకెత్తలేదు. మళ్లీ విత్తనాలు వేసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా వర్షాలు తొందరగా కురిసేవి. తొలకరిలో వేసిన విత్తనాలు మొలకెత్తేవి. ఈఏడాది మాత్రం వర్షం పడక నష్టపోయాం.
రవి, బండల్ నాగపూర్ రైతు