
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసెస్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ జర్మనీకి చెందిన డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ నగారోను కొనుగోలు చేయనుంది. దీంతో కంపెనీ యాన్యువల్ రెవెన్యూ 2.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.27,800 కోట్ల) కు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్లోబల్‌గా ఏఐ-తో నడిచే డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీగా ఎదగాలని చూస్తోంది.
డీల్ వివరాలు..
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సబ్సిడరీ గెలాక్సీ జర్మనీ హోల్డింగ్ ఎస్‌ఈ ద్వారా నగారోలోని ప్రతి షేరుకు 81 యూరోల చొప్పున నగదు చెల్లించి ఓపెన్ ఆఫర్ ద్వారా షేర్లను సేకరించనుంది. దీనిని బట్టి డీల్ విలువ రూ.11,500 కోట్లకు దగ్గర ఉండొచ్చని అంచనా. నగారోలో అత్యధిక వాటా (21శాతం) కలిగిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ లంతానో బెటెయిలిగుంగెన్ తన పూర్తి వాటాను ఇదే ధరకు పెర్సిస్టెంట్‌కు విక్రయించేందుకు బైండింగ్ ఒప్పందం చేసుకుంది.
నగారో మేనేజ్‌మెంట్ కూడా ఈ అమ్మకానికి మద్దతు తెలిపింది. పెర్సిస్టెంట్‌కు అమెరికా మార్కెట్‌లో బలమైన పట్టు ఉండగా, నగారో యూరప్ మార్కెట్‌లో విస్తరించింది. ఈ కంపెనీకి ఈఆర్‌పీ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ (సీఎక్స్), ఏఐ రంగాల్లో మంచి నైపుణ్యం ఉంది. ఈ రెండింటి కలయికతో గ్లోబల్ క్లయింట్లకు మల్టీ-రీజియన్ సేవలు సులువవుతాయి.
నగారో సబ్సిడరీ కంపెనీగా కొనసాగుతుంది. పెర్సిస్టెంట్ ఉద్యోగుల సంఖ్య 40 కి పైగా దేశాల్లో 46 వేలకు చేరుకుంటుంది. ఇందులో అత్యధికంగా భారతదేశంలో 37 వేల మంది, అమెరికా, యూరప్‌లో 3 వేల మంది చొప్పున ఉంటారు.