Reading Time: 2 minutes

ఆ గోల నేను పట్టించుకోను.. ‘ఇడుపు కాయితం’ టైటిల్ వివాదంపై బన్నీ వాస్ కౌంటర్!

Caption of Image.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నటుడు ప్రియదర్శి, నాగదుర్గ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్టు ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham).  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో ..  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్టు చుట్టూ ఒక రేంజ్ లో చర్చలు, వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్, దాని వెనకున్న తెలంగాణ ప్రాంతీయ నేపథ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అసలేంటి ఈ ‘ఇడుపు కాయితం’ వివాదం?

తెలంగాణ మాండలికంలో ‘ఇడుపు కాయితం’ అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం. సాధారణంగా భార్యాభర్తల కలిసి బతకలేము అనుకున్నప్పుడు ఊరి పెద్దల సమక్షంలో ఒక ఒప్పంద పత్రం రాసుకునేవారు. అలా ఒకరినొకరు విడిచిపెట్టేటప్పుడు రాసుకునే అగ్రిమెంటే ఈ ‘ఇడుపు కాయితం’. ఆ పేరునే ఇప్పుడు ఒక సినిమాకు  టైటిల్‌ను పెట్టడం, పైగా దాన్ని తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌కే ముడిపెట్టడంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ..

ఈ వివాదం కాస్తా సోషల్ మీడియాలో ‘ఆంధ్రా వర్సెస్ తెలంగాణ’ ప్రాంతీయ ఘర్షణగా మారింది. దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా?, ఆంధ్రా వాళ్లం మాకు అర్థం కావట్లేదు, థియేటర్లలో సబ్‌టైటిల్స్ వేయండి ప్లీజ్! అంటూ కొందరు ఆంధ్రా నెటిజన్లు ఎక్స్‌లో  సెటైర్లు వేశారు. దీనికి తెలంగాణ నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.  గతంలో సినిమాల్లో ఆంధ్రా మాండలికాలైన గోదారి యాస, రాయలసీమ సీమ పల్లాలు వాడినప్పుడు తామెప్పుడూ డబ్బింగ్ అడగలేదని.. ఇప్పుడు ఒక తెలంగాణ పదం వాడగానే ఇంతలా ట్రోల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

 

కాంట్రవర్సీపై బన్నీ వాస్ కౌంటర్

ఈ వివాదంపై నిర్మాత బన్నీ వాస్ చాలా కూల్‌గా, అంతే స్ట్రాంగ్‌గా స్పందించారు. సినిమా టైటిల్ అనేది కేవలం కథను బట్టి, ఆ కథ జరిగే ప్రాంతాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతుందని స్పష్టం చేశారు. నేను కేవలం సినిమా క్వాలిటీపైనే ఫోకస్ పెడుతున్నాను. చుట్టూ జరుగుతున్న సోషల్ మీడియా గోల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. రేపు థియేటర్లలో సినిమానే మాట్లాడుతుంది. ఆంధ్రా ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా.. సినిమా బాగుంటేనే చూస్తారు. కాబట్టి ఒక మంచి సినిమా తీయడమే నా బాధ్యత అని బన్నీ వాస్  చెప్పారు.

కొత్త టాలెంట్ తోనే ..

వివాదాలన్నీ సినిమా కంటెంట్ బాగుంటే క్షణాల్లో మాయమైపోతాయని బన్నీ వాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కథ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు. అలాగే ఈ సినిమాలో కొత్త వాళ్లతో వర్క్ చేయడం వల్ల రెమ్యునరేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పైగా సబ్జెక్ట్‌పై పూర్తి శ్రద్ధ పెట్టొచ్చు  అని అన్నారు. ఏదేమైనా ప్రియదర్శి మార్క్ యాక్టింగ్, సుకుమార్ ప్రెజెంటేషన్ తో వస్తున్న ఈ ‘ఇడుపు కాయితం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.