Reading Time: 2 minutes

వెనెజువెలా కాదు.. చరిత్రలోనే అత్యంత భారీ భూకంపాలు ఇవే..!

Caption of Image.

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించడంతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కేవలం నిమిషం వ్యవధిలోనే రిక్టర్ స్కేల్‌‌‌‌‌‌‌‌పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల ధాటికి దేశంలోని అనేక పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. పట్టణాలు ఎటుచూసినా శిథిలాల గుట్టలుగా మారాయి. 

ఈ భూ ప్రళయానికి 188 మంది చనిపోగా, 1,520 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా లా గ్వైరా రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించినట్టు తెలిపింది. అయితే, శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుపోయారని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. వెనెజువెలా జంట భూకంపాల నేపథ్యంలో ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద భూకంపాల గురించి చర్చ మొదలైంది. వెనెజువెలాలో సంభవించిన భూకంపాలే ఇప్పటి వరకు చరిత్రలో నమోదైన అతి పెద్ద భూకంపాలా.. లేక ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకుందాం..

చరిత్రలోనే అత్యంత  భారీ భూకంపాలు ఇవే..

వాల్దివియా (చిలీ) 1960: ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనదిగా రికార్డైన ఈ భూకంపం మే 22న దక్షిణ చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 9.5గా నమోదైంది. 1,655 మంది చనిపోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ప్రిన్స్ విలియం సౌండ్ (అలాస్కా), 1964: ఉత్తర అమెరికా చరిత్రలోనే అతిపెద్దది, ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన ఈ భూకంపం మార్చి 27న సంభవించింది. 9.2 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల అలాస్కా, ఒరెగాన్, కాలిఫోర్నియా ప్రాంతాల్లో మొత్తం 131 మంది ప్రాణాలు కోల్పోయారు.

సుమత్రా (ఇండోనేసియా), 2004: డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం సృష్టించిన సునామీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘోర విపత్తులో ఏకంగా 2,30,000 మంది మరణించారు.

తోహోకు (జపాన్), 2011: మార్చి 11న ఈశాన్య జపాన్‎లో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనివల్ల 130 అడుగుల ఎత్తున ఎగిసిపడిన సునామీ కెరటాలు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో 18,000 మందికి పైగా మరణించారు. 

మౌలే (చిలీ), 2010: ఫిబ్రవరి 27న మధ్య చిలీలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల వచ్చిన సునామీ 2,000 కి.మీ. తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తుల కారణంగా 526 మంది చనిపోగా, 18 లక్షల మంది ప్రభావితమయ్యారు.

టర్కీ-సిరియా, 2023: ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ తర్వాత 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో రెండు దేశాల్లో కలిపి 59,000 మందికి పైగా మరణించారు.

నేపాల్, 2015: ఏప్రిల్ 25న ఖాట్మండుకు వాయవ్యంగా ఉన్న గూర్ఖా కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 9,000 మంది చనిపోగా, 22,000 మందికి పైగా గాయపడ్డారు.
 

©️ VIL Media Pvt Ltd.