
Explainer: దుబాయ్ అనగానే ఆకాశహర్మ్యాలు.. విలాసవంతమైన జీవితం… వ్యాపార సామ్రాజ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఇటీవల ఇరాన్ చేసిన దాడులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడూ లేనంతగా ఆందోళన మొదలైంది. పర్యాటకులు, పెట్టుబడిదారులను తిరిగి రప్పించేందుకు దుబాయ్ ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ నాలుగు నెలల కాలంలో కోల్పోయిన దానిని త్వరగా పూడ్చుకునేందుకు దుబాయ్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది.
మార్చిలో యూఏఈ అంతటా ఇరాన్ వరుస దాడులకు పాల్పడింది. ఇవి గల్ఫ్ టూరిజంతో పాటు ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. కేవలం భౌతికంగా జరిగిన ఆస్తి నష్టం కంటే.. అక్కడికి వచ్చే వ్యాపారుల్లో.. పెట్టుబడిదారుల్లో భద్రతపై విశ్వాసం సన్నగిల్లడం ప్రభుత్వాన్ని ఎక్కువగా కలవరపెట్టింది. పశ్చిమాసియాలో ప్రశాంతమైన., సురక్షితమైన ప్రాంతంగా పేరున్న దుబాయ్‌కు ఇది ఊహించని పరిణామం. పరిస్థితి పూర్తిగా చేజారిపోకముందే అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. వెంటనే రంగంలోకి దిగారు. వందలాది మంది వ్యాపార దిగ్గజాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశం నుంచి ఉన్నపళంగా మూలధనం తరలిపోకుండా, బహుళజాతి వ్యాపార సంస్థలు వెళ్లిపోకుండా ఆపేందుకు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. సెంట్రల్ బ్యాంక్ లిక్విడిటీ ప్యాకేజీ సహా పలు ఆర్థిక ఉద్దీపన చర్యలకు బీజం వేశారు. రాబోయే విపత్తును ముందే పసిగట్టి దానిని అడ్డుకునేందుకు అడుగులు వేశారు.
ఇరాన్ దాడుల దెబ్బకు తక్షణమే ఎక్కువగా నష్టపోయింది పర్యాటక, రిటైల్ రంగాలే. ఏటా కోట్ల మంది పర్యాటకులతో కళకళలాడే దుబాయ్ వీధులు ఒక్కసారిగా వెలవెలబోయాయి. దీంతో ఈ రంగాలకు తక్షణ ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీని ప్రకటించింది. సుమారు 2.5 బిలియన్ దిర్హామ్స్.. అంటే దాదాపు 681 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఉన్నతాధికారులు సైతం అక్కడి వ్యాపారాలకు భరోసా కల్పించారు. సంస్థలకు అవసరమైన అన్ని విధాల ఆర్థికపరమైన మద్దతు ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. వస్తువుల సరఫరాలో సప్లై చెయిన్ సమస్యలు తలెత్తకుండా రాత్రింబవళ్లు పనిచేసేలా చేశారు. జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్ లాంటి దిగ్గజ ఆర్థిక సంస్థల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లతో వరుస కాల్స్ నిర్వహించి వారికి ధైర్యం చెప్పారు. దాడుల భయంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులను తిరిగి ఆకర్షించేందుకు, ప్రాజెక్టులు ఆగిపోకుండా చూసేందుకు అన్ని రకాల దౌత్యపరమైన, ఆర్థికపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
దుబాయ్ ఆర్థిక శాఖ ఈ సంక్షోభ నివారణ కోసం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి దుబాయ్ క్రౌన్ కూడా స్వయంగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు కీలక ప్రశ్నలపై సుదీర్ఘంగా చర్చించారు. భయపడిపోయిన పర్యాటకులను తిరిగి దేశానికి ఎలా రప్పించాలి? వెనక్కి వెళ్లిపోతున్న పెట్టుబడిదారులను మళ్లీ ఎలా ఆకర్షించాలి? నష్టాల్లో ఉన్న వ్యాపారాలకు ప్రభుత్వం తరఫున ఎలా మద్దతు ఇవ్వాలి? అనే అంశాలపై వ్యాపారవేత్తల సలహాలు, సూచనలు అడిగారు. క్రౌన్ ప్రిన్స్ స్వయంగా వ్యాపారుల టేబుల్స్ వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా ఇంకా కొంత సమయం పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బయట ప్రపంచానికి దుబాయ్ ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఆర్థిక పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అత్యంత కీలకమైన హోటల్ ఆక్యుపెన్సీ రేటు దారుణంగా పడిపోయింది. ఈ సంక్షోభం కారణంగా దిగ్గజ ఆర్థిక సంస్థ HSBC విశ్లేషకులు గల్ఫ్ దేశాల వృద్ధి అంచనాలను అమాంతం తగ్గించారు. 2026 ఆర్థిక సంవత్సరానికి ఈ ప్రాంతం వృద్ధి రేటును ఏకంగా 5 శాతం మేర కోత విధించారు. గతంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతం వృద్ధి రేటు క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబిలలో చమురేతర వృద్ధి రేటు.. అంటే నాన్-ఆయిల్ గ్రోత్ ఏడాదికి 8 శాతం మేర పడిపోవచ్చని అంచనా వేశారు. ఆయిల్ మీద ఆధారపడకుండా రియల్ ఎస్టేట్, టూరిజం మీద ఆధారపడ్డ దుబాయ్ లాంటి నగరానికి ఇది అతిపెద్ద సవాల్ గా మారింది.
ఇలాంటి కష్టకాలంలోనూ దుబాయ్ తన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని రోడ్ల వెంబడి కొత్తగా దుబాయ్-ఇట్ అనే ఆకర్షణీయమైన హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. పనులను వేగంగా పూర్తి చేయడం, రాబోయే మంచి రోజులపై భరోసా కల్పించడం ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. గల్ఫ్ సార్వభౌమ సంపద నిధులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన పన్ను విధానాలు, సమయపాలన ఎప్పుడూ అంతర్జాతీయ మూలధనాన్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే యుద్ధ వాతావరణం, తాజా పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య రవాణా మార్గాలు గణనీయంగా మారుతున్నాయి. సాధారణంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి గుండా వెళ్లాల్సిన అనేక కార్గో నౌకలు.. భద్రతా కారణాల దృష్ట్యా ఆ మార్గాన్ని తప్పించుకుని ఓమన్, సౌదీ అరేబియా మీదుగా ప్రయాణిస్తున్నాయి. దుబాయ్ పోర్టులను బైపాస్ చేస్తూ ఈ నౌకలు వెళ్లడం వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అంశం.
గల్ఫ్ దేశాల్లో ఏర్పడే ఆర్థిక, భౌగోళిక సంక్షోభాలను ఎదుర్కొని నిలబడటంలో దుబాయ్ ఎప్పుడూ తన సత్తా చాటుకుంటూనే ఉంటుంది. ఈ తాజా పరిణామాలను కూడా అంతే దీటుగా ఎదుర్కొని మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.