
వికారాబాద్: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు వివాదంలో చిక్కుకున్నాడు. వికారాబాద్ అనంతగిరి రోడ్లపై థార్ కారుపై పడుకుని నానా రచ్చ చేశాడు. ఉప్పల్ బాలు రన్నింగ్లో ఉన్న థార్ కారుపై నిల్చుని, పడుకుని, దొర్లుతూ.. స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతగిరి పుణ్యక్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు వచ్చే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉప్పల్ బాలు, అతనితో పాటు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పర్యాటకులపై నిబంధనలు అమలు చేసే అధికారులు ఇలాంటి స్టంట్లపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. స్థానికులు ఈ అంశంపై స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉప్పల్ బాలుకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్ స్టాగ్రాంలో అయితే ఏకంగా.. 3 లక్షల 86 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు వచ్చిన ఫేమ్తో చాలా ప్రమోషన్స్ చేసి లక్షల్లో డబ్బు సంపాదించుకున్నాడు. తన విపరీత చేష్టలతో నవ్వు తెప్పించే ఉప్పల్ బాలు ఇలా పుణ్య క్షేత్రాల దగ్గర కూడా వెకిలి చేష్టలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.
లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు బాధ్యతగా నడుచుకోకుండా ఇలా అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఉప్పల్ బాలు తీరు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అయినా మారాలని, మార్చుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.