
సింహగిరిని నరేంద్రుడు పాలించేవాడు. మహారాణికి కానుకగా కోట పక్కన ఉన్న ఉద్యానవనంలో రామాలయం, కృష్ణాలయం నిర్మించి ఇవ్వాలని తలచి పక్క రాజ్యాల నుంచి సుధాముడు, వీరయ్య అనే ఇద్దరు పేరున్న శిల్పులను పిలిపించి వారికి బాధ్యతలు అప్పగించాడు రాజు. వారికి, సహాయ శిల్పులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు మంత్రి. వీరయ్య, సుధాముడు తమకు సహాయ శిల్పులుగా పదేసి మందిని తమతోపాటు తీసుకొచ్చారు.
ఏడాదిలోగా వీరయ్య కృష్ణ మందిరం పూర్తి అయ్యింది. ఒక శుభ ముహూర్తాన ఆ మందిరాన్ని రాజుకు అప్పగించాడు. తనకు సాయపడ్డ పదిమంది శిల్పులను కోట నుంచి పంపించివేశాడు. రాజు ‘‘మీ సహాయ శిల్పులు ఎక్కడ?’’ అని అడిగాడు. ‘మహారాజా! వారికి మరో చోట పని పురమాయించాను’ అని చెప్పాడు వీరయ్య. ‘‘మీకు, మీ సహాయ శిల్పులకు కలిపి ఇవిగో ఇరవై వేల వరహాలు’’ అని వీరయ్యకు ఇచ్చి సన్మానించాడు రాజు. తరువాత వీరయ్య తన దగ్గర పని చేసినవారికి అందరికీ కలిపి వెయ్యి వరహాలు మాత్రమే ఇచ్చాడు. అప్పటికి రామ మందిరం నిర్మాణం సగం మాత్రమే అయ్యింది.
“వీరయ్య మందిరం పూర్తి చేసి ఇచ్చాడు నీకు ఎందుకు ఆలస్యం అవుతోంది” అని అడిగాడు రాజు. “మహారాజా! శిల్పంలో కళ ఉట్టిపడాలి. అందుకు తగిన సమయం పడుతుంది” అన్నాడు సుధాముడు. “అవును మహారాజా! సుధాముడు చెప్పింది అక్షర సత్యం” అన్నాడు మంత్రి. “సరే మీరు తగినంత సమయం తీసుకోండి” అన్నాడు రాజు. మరో ఆరు మాసాలకు రామ మందిరం పూర్తి అయ్యింది.
ప్రతి రాతి స్తంభముతో పాటు ఎటు చూసినా శిల్ప కళ ఔరా అనిపించేలా ఉంది. మందిరంలో రామయ్య విగ్రహం నిజంగా జీవం పోసుకునేలా మలచబడి ఉంది. రాజు, రాణి, మంత్రితో సహా చూసిన ప్రతి ఒక్కరూ సుధాముడి శిల్పకళను మెచ్చుకున్నారు కృష్ణ మందిరం కంటే రామ మందిరం అపురూపంగా ఉందని చూసిన వారు అన్నారు. రాజు సుధాముణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు.
‘‘రాజా! ఇది నా గొప్పతనం కాదు నాకు సాయం చేసిన శిల్పులది’’ అన్నాడు సుధాముడు ఎంతో వినమ్రంగా. సుధాముడి కోరిక ప్రకారం రాజు సుధాముడితో సహా మిగతా శిల్పులందరికీ రెండు వేల వరహాల చొప్పున ఇచ్చి ఘనంగా సన్మానించాడు. వీరయ్యకు, సుధాముడికి ఉన్న తేడాను గమనించాడు రాజు.
సుధాముడు తన దగ్గర ఉన్న సహాయ శిల్పులకు సమానంగా వరహాలు ఇప్పించిన విషయం వీరయ్య దగ్గర పని చేసే శిల్పులకు తెలిసి, వారు వీరయ్య దగ్గర పని మానేసి సుధాముడి దగ్గర పనిచేయడానికి సిద్దపడ్డారు. సుధాముడి పనితనం ఇతర రాజ్యాల వారు కూడా గుర్తించారు. తప్పు తెలుసుకున్న వీరయ్య మనసులోనే పశ్చాత్తాపపడ్డాడు.
– యు. విజయశేఖర రెడ్డి-