
India vs Ireland: ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిరీస్ డిసైడర్ అయిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఒక్క పరుగు తేడాతో టీమిండియా ఓడిపోవడం, సిరీస్‌ను ఐర్లాండ్ 2–0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడాన్ని ఇండియన్ క్రికెట్ అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. సీనియర్ ప్లేయర్స్ లేకపోయినా.. ఐర్లాండ్ వంటి చిన్న జట్టు మనల్ని క్లీన్‌స్వీప్ చేయడం ఏంటంటూ నెటిజన్లు బీసీసీఐ, ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఛేజింగ్ చేతకాదా?:
155 పరుగుల టార్గెట్‌ను కూడా చేధించలేక ఆఖరి ఓవర్లో చేతులెత్తేసిన భారత బ్యాటర్లపై క్రికెట్ ఫ్యాన్స్ విమర్శల పర్వం కురిపిస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో 34 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయారు, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బుద్ధి తెచ్చుకుని స్మార్ట్ క్రికెట్ ఆడాలి కదా అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని, ఐర్లాండ్‌ను 154 రన్స్‌కే కట్టడి చేసినా.. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చేజేతులా వదిలేసుకున్నారంటూ ఇండియన్ బ్యాటర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.
వైభవ్‌ను బెంచ్‌కే ఎందుకు పరిమితం చేశారు:
ఈ సిరీస్ అంతటా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేయడంపై సెలెక్టర్లపై, కెప్టెన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌ను కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోబెట్టడానికే ఐర్లాండ్ తీసుకెళ్లారా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణలను పక్కన పెట్టి తుది జట్టులోకి డెబ్యూ చేసిన సురేశ్ షెడ్జ్, ప్రిన్స్ యాదవ్ పర్వాలేదనిపించినా.. ఓపెనర్లతో పాటు మిడిలార్డర్ బ్యాటర్ల నిర్లక్ష్యంతోనే భారత జట్టు పసికూన ఐర్లాండ్ జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయిందని తిట్టిపోస్తున్నారు.
►ALSO READ | హర్మన్‌ప్రీత్ పోరాటం వృథా.. భారత్‌పై 6 వికెట్లతో గెలిచిన ఆసీస్.. వరల్డ్కప్ నుంచి ఇండియా ఔట్
ఒకే రోజు రెండు ఘోర పరాజయాలు:
ఆదివారం భారత్‌కు క్రీడాపరంగా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఒకవైపు లండన్ లార్డ్స్ వేదికగా జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి భారత ఉమెన్స్ టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరోవైపు ఇటు బెల్ఫాస్ట్‌లో మెన్స్ యంగ్ ఇండియా ఐర్లాండ్ చేతిలో ఘోరంగా సిరీస్ ని కోల్పోయింది. భారత్ ఒకే రోజు రెండు మ్యాచులు ఓడిపోవడంతో బ్లాక్ సండేగా సోషల్ మీడియాలో అభివర్ణిస్తున్నారు.