
డబ్లిన్: పసికూన ఐర్లాండ్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. వరల్డ్ నెంబర్ 1 టీ20 జట్టు టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం (జూన్ 28) బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో ఐర్లాండ్ జట్టు ఒక్క పరుగు తేడాతో ఇండియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్‌స్వీప్ క్రికెట్ లో నయా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల మోస్తారు లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా 153 పరుగులు చేసి ఒక్క రన్ తేడాతో ఓటమి పాలైంది.
రాణించిన భారత బౌలర్స్
ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి మ్యాచులో విఫలమైన భారత బౌలర్లు రెండో మ్యాచులో రాణించారు. అతిథ్య ఐర్లాండ్‌ను 154 పరుగుల మోస్తారు స్కోరుకే కట్టడి చేశారు. ఐర్లాండ్ స్టార్ హ్యారీ టెక్టర్ (53) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. బెంజమిన్ కలిటిస్ (37) రాణించాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. శివమ్ దూబే, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షిత్ రానా ఒక వికెట్ సాధించాడు.
►ALSO READ | దండం రా అయ్యా.. పసికూన చేతిలో క్లీన్‌స్వీప్ అవుతారా? నెట్టింట భారత క్రికెటర్లపై ట్రోల్స్
మళ్లీ తేలిపోయిన టీమిండియా బ్యాటర్స్:
తొలి టీ20లో తేలిపోయిన టీమిండియా బ్యాటర్స్ రెండో మ్యాచులోనూ 155 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చేతులేత్తేశారు. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ డకౌటై తీవ్రంగా నిరాశపర్చారు. ఇషాన్ కిషన్ (10), కెప్టెన్ (12) అయ్యర్ మరోసారి విఫలమయ్యారు. ఈ క్రమంలో తిలక్ వర్మ (55) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. తిలక్ క్రీజులో ఉన్నంత సేపు ఇండియా సునాయాసంగా గెలిచేలా కనిపించింది. కానీ అతడే ఔట్ అయ్యాక సీన్ మారిపోయింది. చివర్లో హర్షిత్ రాణా (21) పోరాడిన ఇండియాకు ఓటమి తప్పలేదు. జై మూండ్ర, మాథ్యూ హోల్లార్డ్ చెరో మూడు వికెట్లతో ఇండియా పతనాన్ని శాసించారు. మాథ్యూ హంఫ్రీస్, హ్యారీ టెక్టర్ చెరో వికెట్ తీశారు.
సొంత గడ్డపై ఐర్లాండ్ జట్టు మైండ్ బ్లోయింగ్ ప్రదర్శనతో టీమిండియాకు చుక్కలు చూపించింది. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన హోస్ట్ టీమ్.. రెండో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి సిరీస్‌ను 2-0తో తమ ఖాతాలో వేసుకుంది. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలోనే భారత్‌పై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మొదటి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ సమం చేస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. సీనియర్ ఆటగాళ్లు లేని లోటు ఈ సిరీస్‌లో స్పష్టంగా కనిపించింది.