Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం : ఈ నాలుగు పనులు చేయకండి.. జీవితం సంతోషంగా ఉంటుంది…!

Caption of Image.

బంగారు కుదువ బెట్టకు 
సంగరమున పారిపోకు సరసుడవైనన్‌ 
అంగడి వెచ్చములాడకు  
వెంగలితో చెలిమి వలదు వినురా సుమతీ

నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే, నా నీతి ఆలకించు. బంగారం తాకట్టు పెట్టకు. యుద్ధంలో పలాయనం చేయొద్దు. ఇంటికి కావలసిన చిల్లర సరుకులు దుకాణంలో అరువుకు కొనొద్దు. యుక్తాయుక్త జ్ఞానం లేనివారితో స్నేహం చేయొద్దు అంటున్నాడు.. సుమతీ శతకకారుడు బద్దెన. 

బద్దెన చెప్పిన ఈ నాలుగు సూత్రాలను అనుసరిస్తే మానవ జీవితం సంతోషంగా ఉంటుంది అని తెలుస్తుంది. మనుషుల దగ్గర ఉండే వస్తువులలో బంగారం అతి విలువైన వస్తువు. ఒకప్పుడు అవసరార్థం ఇంట్లో ఉండే ఇత్తడి పాత్రలను, రాగి పాత్రలను, కొన్ని ఖరీదైన వస్తువులను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకునేవారు. సాధారణంగా మనకు పరిచయం ఉన్నవారు, మిత్రులు, బంధువులు మొదలైనవారు మనం అప్పు అడగ్గానే మన మీద ఉండే నమ్మకంతో అప్పు ఇస్తారు. ఆ అప్పును మనం సమయానికి తీర్చేస్తే, మరోసారి అడిగినా కూడా అప్పు ఇస్తారు. 

అప్పట్లో ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతుండేవి. అందువల్ల తాత్కాలిక ఇబ్బందులు తీరేవి. అలాగే బద్దెన కూడా అవతలి వ్యక్తికి మన మీద విశ్వాసం కలిగేలా చూసుకుని, చేబదులుగా అవసరానికి మాత్రమే అప్పు తీసుకుని, తిరిగి ఇచ్చేయడం ఉత్తమం. అంతేకాని ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని హితబోధ చేస్తున్నాడు. 

అదేవిధంగా.. ఇంటిలో కావలసిన చిల్లర సరుకులను దుకాణంలో అరువుకు కొనొద్దని కూడా చెప్తోంది ఈ పద్యం. తిండికి సంబంధించి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆకలి తీరటానికి తినేది. రెండోది జిహ్వ చాపల్యానికి తినేది. ఆకలి తీరటం కోసం కిరాణా కొట్టులో అరువు చేయడం తప్పు కాదు. జిహ్వ చాపల్యం కోసం అప్పు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 

మనకు వచ్చే ఆదాయం ఎంతో లెక్క చూసుకుని, ఆదాయంలో ముందుగా ఆహారానికి అవసరమైన సరుకుల కోసం డబ్బు కేటాయించుకోవాలి. అప్పుడు తిండి కోసం అప్పు చేయవలసిన అవసరం రాదు. సాధారణంగా డబ్బులు ఇచ్చి కొనే సరుకులు తక్కువ ధరకు లభిస్తాయి. అరువు పెట్టి కొంటే వడ్డీ జత చేసి, అధికధరకు అమ్ముతారు. 

అందుకే శక్తికి మించిన ఖర్చు కారణంగా హెచ్చు ధర చెల్లించవలసి వస్తుంది. అందువల్ల ఎప్పుడూ అప్పులో ఉండిపోవడమే కాకుండా, మనకు కావలసిన మేలిమి సరుకును ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఎక్కువ సొమ్ము చెల్లించి కూడా, వారి ముందు దీనంగా నిలబడాలి. అందువల్ల చిల్లర సరుకులను అరువుకి కొనరాదని చెప్తున్నాడు బద్దెన.

ఇక మరో విషయం ..యుద్ధంలో పారిపోకూడదు. పిరికితనం వల్లే పారిపోతారు. పిరికితనం ఎన్నడూ ప్రశంసనీయం కాదు. పౌరుషం క్షత్రియధర్మం. విజయనగర సామ్రాజ్యానికి – బహమనీ సుల్తానులకూ రక్కసతంగడి దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మోసంతో అళియరామరాయల తల నరికి, ఈటెకు గుచ్చి పైకెత్తి చూపారు సుల్తానులు. అది చూడగానే.. విజయనగర సేన తమ నాయకుడు చనిపోయినందుకు బెదిరి పారిపోయింది. వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ పిరికితనం కారణంగా వారు పారిపోయారు. దాంతో విజయనగరం ధ్వంసమైపోయింది. 

పిరికితనం వహించక నిలబడి ఉంటే, విజయనగర చరిత్ర మరోలా ఉండేది. రామాయణంలో రాముడు తాటకిని చంపడానికి రెండడుగులు వెనుకకు వేసినప్పుడు, విశ్వామిత్రుడు యుద్ధనీతి బోధించి, తాటకిని సంహరింపచేశాడు. 

నాలుగో అంశం 

జ్ఞానం లేని వెంగలివానితో స్నేహం చేయకుండా ఉండటం. మూర్ఖత్వం కలిగినవాడు, వివేకశూన్యుడు.. ఒకరు చెప్తే వినడు. వానికి తోచదు. ఇటువంటివారు తాము నాశనమైపోవటమే కాకుండా, వారిని నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముంచుతారు. రామాయణంలో .. రావణుడి మూర్ఖత్వం కారణంగానే పుత్రులను, అనేక మంది బంధువులను, వీరులను పోగొట్టుకున్నాడు.

 లంకానగర పౌరుల వినాశనానికి కారణమయ్యాడు. ఇక మహాభారతంలో దుర్యోధనుడు తనను నమ్ముకున్న కర్ణుడు మొదలుగా, తమ్ములనందరినీ కోల్పోయాడు. కురు, గురు వృద్ధుల మరణానికి కారణభూతుడయ్యాడు. వారి మూర్ఖత్వమే వారి నాశనానికి కారణమైంది. అంతేకాదు.. ఆ మూర్ఖత్వమే వారి మిత్రులను, బంధువులను కూడా నశింపచేసింది. కనుకనే వెంగలివానితో స్నేహం పనికిరాదంటున్నాడు బద్దెన.

– డా. పురాణపండ వైజయంతి-

©️ VIL Media Pvt Ltd.