
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలెర్ట్ జారీ చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ దళారులు తిరుగుతున్నారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కొంతమంది భక్తులను .. దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తులు మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మవద్దని మరోమారు టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి దర్శనాలు, తిరుమలలో వసతికి సంబంధించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. కొంతమంది మోసపూరితమైన మాటలతో భక్తులను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయించే సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ఎవరైనా దర్శనాలు, వసతి కలుగజేస్తామని మీ దగ్గరకి వస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ : 155257 కు ఫిర్యాదు చేయాలని భక్తులకు టీటీడీ అధికారులు తెలిపారు. కలియుగ దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఎంతో విశ్వాసము ఉంచి స్వామివారి దర్శనం కోసం పరితపించే భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న వారు ఎంతటివారైనా సరే టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.
మరోవైపు వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తమని టీటీడీ స్పష్టం చేసింది. నిత్యం వెయ్యి మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం.. వసతి.. ఇతర వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలి. దళారులు, మధ్య వర్తుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ అధికారులు తెలిపారు.