
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఇంధన దిగ్గజం సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం (జూన్ 28) రాస్ తానూరా ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ సౌదీ పౌరులేనని అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణమేంటి అన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తి అయిన తర్వాత ప్రమాదానికి గల కారణమేంటన్న దానిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఈ ఘటనను సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేసింది.
సౌదీ అరామ్కో విమానయాన కార్యకలాపాలు:
సౌదీ అరామ్కో కంపెనీ సౌదీ అరేబియా ఇంధన దిగ్గజం. ఈ కంపెనీ 1934 నుంచి విమానయాన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తొలుత ఒకే విమానంతో మొదలైన ఈ కంపెనీ ప్రస్థానం ప్రస్తుతం 60 విమానాలకు చేరింది. ఎక్కువగా తన సొంత కార్యకలాపాల కోసమే కంపెనీ ఈ విమానాలను వినియోగిస్తుంటోంది.
సౌదీ అరామ్కో కంపెనీ తన ఏవియేషన్ విభాగాన్ని 2023లో ఒక ప్రత్యేక అనుబంధ సంస్థగా విభజించి.. తర్వాత దానికి అలోలా ఏవియేషన్ అని పేరు మార్చారు. సౌదీ అరేబియా వ్యాప్తంగా సముద్రతీర కార్యకలాపాలు, వైద్య తరలింపులు, లాజిస్టిక్స్ సేవలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తోంది.
►ALSO READ | పశ్చిమ ఐరోపాలో ఎండల తీవ్రత.. ఫ్రాన్స్ లో వెయ్యికిపైగా మరణాలు