
మీరు ఈ వారంలో ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ ఫైల్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. EPFO తన ఆన్‌లైన్ క్లెయిమ్ పోర్టల్‌ను నాలుగు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేసింది. జూన్ 26 అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఈ మెయింటెనెన్స్ విండో, జూన్ 29 రాత్రి 23:59 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో క్లెయిమ్ అప్లికేషన్, ప్రాసెసింగ్ సహా ఇతర సర్వీసులు అందుబాటులో ఉండవు. మళ్లీ జూన్ 30, 2026 అర్ధరాత్రి 00:00 గంటల నుంచి ఆన్‌లైన్ సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయి.
అప్‌గ్రేడేషన్‌కు కారణాలు:
సేవల డెలివరీని మెరుగుపరచడానికి, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి.. సభ్యులు, యజమానులకు మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారిక నోటీసులో తెలిపింది. డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టడం వల్లే ఈ అంతరాయం ఏర్పడింది. ఈ మెయింటెనెన్స్ కాలంలో మెంబర్ పోర్టల్, ఎంప్లాయర్ పోర్టల్, ఉమాంగ్ యాప్ పూర్తిగా నిలిచిపోతాయి. ముఖ్యంగా క్లెయిమ్ సమర్పణ, ఈసీఆర్ ఫైలింగ్, కొత్త ఉద్యోగుల యూఏఎన్ లింకింగ్, ఈ-పాస్‌బుక్ యాక్సెస్ వంటి సేవలు అసలు పని చేయవు. అయితే జూన్ 26కి ముందే సమర్పించిన క్లెయిమ్‌లు రద్దు కావు కానీ.. వాటి ప్రాసెసింగ్‌లో కొంత ఆలస్యం జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ అత్యవసర సమయంలో సహాయం కోసం సభ్యులు ఈపీఎఫ్ఓ కాల్ సెంటర్ నంబర్ 14470ను సంప్రదించవచ్చు.
ఈపీఎఫ్ఓ 3.0 కనెక్షన్:
ఈ షట్‌డౌన్‌కు.. రాబోయే ‘EPFO 3.0’ రోల్‌అవుట్‌కు సంబంధం ఉన్నట్లు స్పష్టమైన ప్రకటన లేనప్పటికీ, దీని టైమింగ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్ము విత్ డ్రా టెస్టింగ్ పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కొత్త సిస్టమ్ ద్వారా అర్హత గల పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయవచ్చు. ఇది పేపర్‌వర్క్ , సెటిల్‌మెంట్ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఏటీఎం తరహా ఉపసంహరణలు, పేపర్‌లెస్ క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బ్యాకెండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్ ఇందుకోసమేనని భావిస్తున్నారు. సో అత్యవసరం కాని లావాదేవీలను జూన్ 30 తర్వాతే చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.