
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీలు భారీ వెండి పట్టివేతకు దారితీశాయి. తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ స్కూటీని ఆపి పరిశీలించగా, అందులో సుమారు 13.5 కిలోల వెండి బిస్కెట్లు ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. విలువ సుమారు రూ.33 లక్షలు ఉంటుంది.. వాటికి సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాకీర్, అక్షయ్ జాదవ్ వెండి వ్యాపారులు. ఆదోనిలో వెండి క్రయవిక్రయాలు ముగించుకుని తిరిగి ఎమ్మిగనూరుకు స్కూటీపై వెళ్తుండగా పట్టణ శివారులో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో చిక్కారు. స్కూటీలో ఉన్న వెండి బిస్కెట్ల గురించి ప్రశ్నించగా, వాటిని ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరి వద్ద నుంచి తీసుకున్నారో చెప్పలేకపోయారు. అంతేకాకుండా వెండి కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్‌లు లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలను కూడా చూపించలేదు. దీంతో వెండి తరలింపుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్ల బరువు 13.5 కిలోలు కాగా, వాటి విలువ సుమారు రూ.33 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాగే నిందితుల వద్ద ఉన్న స్కూటీతో పాటు రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వెండి తరలింపుకు సంబంధించిన స్పష్టమైన వివరాలు లభించకపోవడంతో, దీని వెనుక పెద్ద స్థాయిలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్లు, ఇతర ఆధారాలను తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులకు అప్పగించనున్నట్లు ఆదోని సీఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.