
Britain Heatwave: పశ్చిమ యూరప్ దేశాలు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బ్రిటన్, స్విట్జర్లాండ్ ఇలా పలు దేశాలు వేడి గాలులతో అల్లాడుతున్నాయి. గురువారం బ్రిటన్‌లో అత్యంత ఉష్ణోగ్రతలు కలిగిన జూన్ రోజుగా నమోదైంది. ఇప్పటికే వేడి గాలుల కారణంగా యూరప్ వ్యాప్తంగా ప్రజలు పిల్లల్లా రాలుతున్నారు. 50 మందికి పైగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, కేవలం 35 డిగ్రీ సెల్సియస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలకు యూరప్ జనాలు ఇంతలా భయపడుతున్నారు. భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నా మన ప్రజలను వేడి ఏం చేయదు.
ఎండ-తేమ కలిసి ఉండటమే కారణం:
బ్రిటన్ చుట్టూ సముద్రాలు ఉంటాయి. సముద్రాలు ఉన్న ప్రాంతంలో సహజంగానే తేమ అధికంగా ఉంటుంది. మన శరీర ఉష్ణోగ్రతలు తగ్గాలంటే చెమట ఆవిరి కావడం కీలకం. ఇలా అయితే శరీరం సహజంగా చల్లబడుతుంది. కానీ గాలిలో తేమ అధికంగా ఉంటే చెమట త్వరగా ఆవిరి కాదు. దీంతో శరీరం నుంచి వేడి బయటకు వెళ్లకపోవడంతో మరింత ఉక్కపోత అనిపిస్తుంది. దీనివల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండె సంబంధిత ఒత్తిడి, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
వాతావరణ శాస్త్రవేత్తలు తరచుగా వడదెబ్బ ఒత్తిడిని అంచనా వేయడానికి వెట్-బల్బ్ ఉష్ణోగ్రతను ఉపయోగిస్తారు, ఇది గాలి ఉష్ణోగ్రత మరియు తేమను కలిపే ఒక కొలమానం. ప్రస్తుతం దక్షిణ ఇంగ్లాండ్‌లో వెట్-బల్బ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుందని అంచనా. ఇది పరిమితి కన్నా ఎక్కువగా ఉంది. వృద్ధులు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.
ఇళ్ల నిర్మాణం కూడా కారణమే:
బ్రిటన్‌లో ఇళ్లు అక్కడి శీతల వాతావరణాన్ని తట్టుకునేలా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతున్నాయి. దీంతో ఇళ్ల నిర్మాణం కూడా ఎండల తీవ్రతను అడ్డుకోలేకపోతోంది. బ్రిటన్‌లోని ఇళ్ల డిజైన్‌లో సాధారణ ఇటుక ఇళ్లు, పెంకుటిళ్లు, కాంక్రీట్ అపార్ట్మెంట్ బ్లాక్‌లు రోజంతా వేడిని గ్రహించి, రాత్రి సమయంలో చల్లని వాతావరణం సమయంలో వేడిని విడుదల చేశాయి. కానీ, ఇప్పుడు ఇదే డిజైన్ మరింత వేడిగా ఉంచేలా చేస్తున్నాయి. అనేక వేడి దేశాల్లో ఏసీలు ఉంటాయి. కానీ బ్రిటన్‌లో చాలా ఇళ్లలో ఏసీలు అరుదుగా కనిపిస్తాయి.
జూన్, జూలై నెలల్లో బ్రిటన్‌లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. దీంతో రోడ్లు, భవనాలు గంటల తరబడి సూర్యరశ్మిని గ్రహించి రాత్రివేళ కూడా వేడిని విడుదల చేస్తుంటాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గకపోవడంతో శరీరానికి విశ్రాంతి దొరకదు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
భారత ప్రజలకు వేడి అలవాటే:
భారత్‌లో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌ను దాటుతాయి. అయినా ప్రజలు ఎండలో తిరుగుతూ తమ పనుల్ని చక్కబెట్టుకుంటారు. మన ప్రజలు ఇక్కడి వేడి వాతావరణానికి అలవాటు పడ్డారు. ఇళ్ల నిర్మాణం కూడా గాలి బాగా ప్రసరించేలా ఉంటుంది.