Reading Time: < 1 minute

మీ కక్కుర్తి తగలెయ్యా.. డిస్కౌంట్ అంటే ప్రాణాలను సైతం లెక్క చేయరా..! ముంబై ఇన్ఫినిటీ మాల్‎లో రూ.1 సేల్‎లో తొక్కిసలాట..!

Caption of Image.

ముంబై: ఫ్రీ, డిస్కౌంట్ అంటే చాలు జనాలు ఎగబడిపోతారు.. ఉచితమన్నా.. తక్కువ ధర అన్నా.. ఎంతదూరమైన వెళ్తారు.. ఫ్రీ, డిస్కౌంట్ వస్తువులు దక్కించుకునేందుకు కొందరైతే ప్రాణాలను కూడా రిస్క్‎లో పెడతారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ఓ మాల్‎లో రూ.1 సేల్ ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. దీంతో మాల్‎లో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్‌లో ఉన్న ఇన్ఫినిటీ మాల్‌లోని NEWME అనే ఫ్యాషన్ బ్రాండ్ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ.1 సేల్ ప్రకటించింది. మొదటి 100 నుంచి 125 మంది కస్టమర్‌లు మాత్రమే డిస్కౌంట్ సేల్‌కు అర్హులని పేర్కొంది. ఈ ప్రకటన వెలువడటమే ఆలస్యం మాల్‎కు జనం పొటెత్తారు. తెల్లవారుజూము నుంచే మాల్ దగ్గర క్యూ కట్టారు. ఊహించిన దానికంటే జనం రెట్టింపు సంఖ్యలో తరలిరావడంతో మాల్ కిక్కిరిసిపోయింది. 

పరిస్థితి తీవ్రతరం కావడంతో మరింత గందరగోళం ఏర్పడకుండా యాజమాన్యం రూ.1 సేల్‌ను రద్దు చేసింది. ఈ రద్దు ప్రకటన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న కొనుగోలుదారులు ఆఫర్ సేల్ రద్దు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే మాల్‎లో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని జనాల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మాల్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, మాల్ నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు. మీ కక్కుర్తి తగలెయ్యా.. డిస్కౌంట్ అంటే ప్రాణాలను సైతం లెక్కచేయరా అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. డిస్కౌంట్ సేల్స్ ప్రకటించేముందు కనీస ఏర్పాట్లు చేయకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడటమేంటని మాల్ నిర్వాహకులపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.