Reading Time: 2 minutes
Donald Trump Viral Oval Office Video Did Trump Doze Off White House Responds

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఓవల్ ఆఫీస్ సమావేశంలో ట్రంప్ కొద్దిసేపు కునుకు తీసినట్లు కనిపించే వీడియో వైరల్ కావడంతో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారాన్ని వైట్‌హౌస్ ఖండిస్తూ.. ట్రంప్ ఇప్పటికీ ‘‘అమెరికా చరిత్రలోనే అత్యంత చురుకైన, ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే అధ్యక్షుడు.’’ అని స్పష్టం చేసింది.

వైట్‌హౌస్‌లోని రిలిజియస్ లిబర్టీ కమిషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధానంగా సంప్రదాయవాద క్రైస్తవ నాయకులతో కూడిన ఈ కమిషన్.. చర్చి-ప్రభుత్వాల మధ్య ఉన్న సంప్రదాయ విభజనను తగ్గించి, మత సంస్థలు-ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండేలా ప్రతిపాదనలపై చర్చిస్తోంది. అయితే సమావేశానికి సంబంధించిన వీడియోల్లో ట్రంప్ కొద్దిసేపు కళ్లుమూసుకుని కూర్చున్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ కొద్దిసేపు కళ్లుమూసుకుని కనిపించారు. మరో వీడియోలో మరో సభ్యుడు మాట్లాడుతుండగా ట్రంప్ ఒక్కసారిగా తల పైకెత్తినట్లు కనిపించింది.

ఈ వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. కొందరు ‘‘ట్రంప్ మళ్లీ సమావేశంలో నిద్రపోయారా?’’ అంటూ వ్యాఖ్యానించగా.. మరికొందరు ‘‘వైట్‌హౌస్ సిబ్బంది అధ్యక్షుడిని లేపాల్సింది’’ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. గత మే నెలలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి రాగా.. అప్పుడు ట్రంప్ నిద్రపోలేదని, కేవలం ఎక్కువసేపు కళ్లుమూసుకుని ఉన్నారని వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మరో సమావేశంలో కూడా ట్రంప్ కునుకు తీస్తున్నట్లు కనిపించిన వీడియో వైరల్ అయింది.

వైట్‌హౌస్ ఏమంది?

ఈ ఘటనపై స్పందించిన వైట్‌హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్.. ట్రంప్‌పై వస్తున్న విమర్శలను పూర్తిగా కొట్టిపారేశారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్ చురుకుదనం, అసాధారణ శక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే తీరు గత ప్రభుత్వంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. గత పాలనలో మాజీ అధ్యక్షుడు బైడెన్ మానసిక, శారీరక ఆరోగ్య క్షీణతను డెమోక్రాట్లు, కొన్ని మీడియా సంస్థలు అమెరికా ప్రజల నుంచి దాచిపెట్టాయి. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత చురుకైన, ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే అధ్యక్షుడు.’’ అని ఇంగిల్ పేర్కొన్నారు.

అయితే వైట్‌హౌస్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ.. వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ట్రంప్ నిజంగానే కొద్దిసేపు కునుకు తీశారా? లేక కేవలం కళ్లుమూసుకుని ఉన్నారా? అనే అంశంపై నెటిజన్ల మధ్య చర్చ కొనసాగుతోంది.