
- విమర్శలు ఎదుర్కొంటూ నీట్ రీఎగ్జాం నిర్వహించడంపై ప్రశంసలు
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ప్రధాని మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలులో ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. శుక్రవారం 57వ పుట్టినరోజు జరుపుకున్న ధర్మేంద్రకు ఎక్స్ వేదికగా మోదీ గ్రీటింగ్స్ చెప్పారు. దేశాన్ని విజ్ఞానం, విద్య, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం అమలులో ఆయన ఎంతో మెచ్చుకోదగిన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలో ఎన్టీఏ ద్వారా నీట్ రీఎగ్జామ్ నిర్వహించడం గొప్ప విషయమని మోదీ పేర్కొన్నారు.
వికసిత్ భారత్‌కు ఏఐ వినియోగం కీలకం
మన దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏఐ వినియోగం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఏఐ.. పరిశ్రమల స్వరూపాన్ని మారుస్తూ, ఉత్పాదకత.. ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను కల్పిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తున్న ‘ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్’ సందర్భంగా పంపిన సందేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభంకాగా, కార్యక్రమంలో ప్రధాని పంపిన మెసేజ్‌ను చదివి వినిపించారు. నూతన టెక్నాలజీతో అకౌంటింగ్, ఆర్థిక రంగాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మనుషుల మేధస్సుకు తోడుగా ఏఐని బాధ్యతాయుతంగా వినియోగిస్తే.. మన సామర్థ్యం పెరగడంతో పాటు మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, వినియోగదారులకు విలువైన సేవలు అందించడం సాధ్యమవుతుందని చెప్పారు.