Reading Time: < 1 minute

స్నాప్‌చాట్ వాడుతున్నారా జాగ్రత్త… అమ్మాయిలే వీడి టార్గెట్.. పరిచయం చేసుకుని బ్లాక్‌మెయిలింగ్

Caption of Image.

సోషల్ మీడియా వేదికగా మహిళలనే లక్ష్యంగా చేసుకుని.. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఒక కిలాడీ నేరగాడిని పట్టుకున్నారు  గచ్చిబౌలి పోలీసులు.  స్నాప్‌చాట్ (Snapchat) యాప్ ద్వారా అమాయక మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ.. వారిని నమ్మించి లోబరుచుకుంటున్న నాగతేజ అలియాస్ నాని అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిచయమైన మహిళల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారి సున్నితమైన ఫోటోలు, వీడియోలను తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం ఇతని నైజం.

ఇటీవలే గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ (DLF) ఎదురుగా ఉన్న ఒక హోటల్ రూమ్‌కు బాధితురాలిని పిలిపించిన నిందితుడు.. కత్తితో బెదిరించి ఆమె నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయభ్రాంతులకు గురిచేసి, ఆమె నుంచి లక్షా 10 వేల రూపాయలను వసూలు చేశాడు.

నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అత్యంత వేగంగా స్పందించి నిందితుడు నాగతేజను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన కత్తితో పాటు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.