Reading Time: 2 minutes
IND vs IRE: ఈ రోజు మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నాడా? లేదా? బ్యాటింగ్ కోచ్ నుంచి కీలక అప్డేట్

ఈ రోజు (శుక్రవారం, జూన్ 26) యంగ్ టీమిండియా, పసికూన ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ఆడనుంది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఐర్లాండ్‌తోనే కదా మ్యాచ్ అని ఎవరూ లైట్ తీసుకోవడం లేదు. అందుకు కారణం ఏంటంటే.. ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ఎస్.. యంగ్ డైనమైట్ వైభవ్ సూర్యవంశీ. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్లేయర్‌గా ఇప్పటికే వైభవ్ పేరు మారుమోగిపోతుంది.

మరి ఆ అమృత ఘడియ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వైభవ్ ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుతాడా? అని వేయి కళ్లతో వెయిటింగ్. అయితే తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారా? లేదా? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే దీనిపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక అప్డేట్ ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలా? వద్దా? అనే విషయాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ రోజు సాయంత్రంలోపు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

అయితే ఆయన చేసిన వ్యాఖ్యల్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. కేవలం వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వడం కోసం రన్స్ చేస్తున్న మరొకరిని డ్రాప్ చేయడం సరైంది కాదని సితాన్షు కోటక్ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘అతనికి అవకాశం వస్తుంది, కానీ కేవలం అవకాశం ఇవ్వడం కోసం పరుగులు చేస్తున్న ఆటగాడిని జట్టు నుండి తొలగించడం సరికాదని నేను అనుకుంటున్నాను. అది వారికి అన్యాయం అవుతుంది.’ అని సితాన్షు కోటక్ అన్నారు. మరి చూడాలి.. కెప్టెన్ అయ్యర్, కోచ్ గంభీర్.. వైభవ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.