
రోడ్డు ప్రమాదాలు, ఆకస్మిక మరణాల వంటి విపత్కర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి బీమా పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అవగాహన లోపం, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులు అర్హత కోల్పోతూ, బాధిత కుటుంబాలు లక్షలాది రూపాయల పరిహారాన్ని నష్టపోతున్నాయి. ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన బీమా పథకాలను అందిస్తోంది. ఏడాదికి రూ.20 లు కడితే చాలు రెండు లక్షల రక్షణ బీమా అందిస్తుంది. అదే..ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దీనికి బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ఉన్నవారు ఏటా కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం ఎదురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష పరిహారం అందిస్తుంది. అలాగే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన . ఇందులో 18 నుండి 50 ఏళ్ల వయసు గలవారు ఏటా రూ.436 చెల్లిస్తే చాలు. ఏ కారణం చేతనైనా పాలసీదారు మరణిస్తే సదరు కుటుంబానికి రూ.2 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కొత్తగా PMJJBY కింద 2.89 లక్షల మంది, PMSBY కింద 8.08 లక్షల మంది చేరారు. అయితే, పాలసీ తీసుకున్నంత మాత్రాన సరిపోదు.. ఏటా మే నెల ముగిసేలోపు ఖాతాలో తగినంత నగదు నిల్వ ఉంచుకుని, ఆటో-డెబిట్ సౌకర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఒంగోలుకు చెందిన ఒక కాలేజీ యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గతంలో అతను రూ.20 బీమా పథకంలో చేరినప్పటికీ, తదుపరి ఏటా రెన్యువల్ కాకపోవడంతో ఆ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం దక్కలేదు. అలాగే, కనిగిరికి చెందిన ఒక రైతు రూ.436 పథకంలో చేరాడు. కానీ, రెండేళ్ల క్రితం బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ డ్రా చేయడంతో ప్రీమియం కట్ అవ్వలేదు. ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించగా, ఖాతాలో నిల్వ లేకపోవడమే శాపంగా మారి భార్యకు రావాల్సిన రూ.2 లక్షల బీమా నిలిచిపోయింది. నిరక్షరాస్యత, బ్యాంకు నిబంధనలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని లీడ్ బ్యాంకు మేనేజర్ రమేష్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ ఉంచుకుని, ఈ సామాజిక భద్రతను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖర్జూరం ప్రియులు తస్మాత్ జాగ్రత్త! గడువు ముగిస్తే.. ముప్పు తప్పదు!
అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్’తో మతిమరుపు మాయం