
ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే…
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు కెఫేలు ఐటీ ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ వర్క్ కెఫేల్లో వేగవంతమైన వై – ఫై, చార్జింగ్ పాయింట్లు, ప్రశాంత వాతావరణం, సౌకర్యవంతమైన సీటింగ్‌తో వర్క్ ఫ్రం కెఫే కల్చర్‌కు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాయి.
కొన్ని కెఫేలు ప్రత్యేకంగా వర్క్ స్టేషన్స్ ఏర్పాటుచేసి రోజువారీ లేదా గంటల వారీ ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి. నగరంలో ప్రత్యేకంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రముఖ కెఫేల్లో నుంచి పనిచేసుకునేందుకు ఇష్టపడుతున్నారు.
వర్క్ ఫ్రం కెఫేకు ప్యాకేజీలు
బంజారా హిల్స్‌లోని లేమెరియన్ వర్క్ ఇన్ కెఫేలో ప్రత్యేకంగా వర్క్ చేయడానికి అనువుగా ఇంటర్నెట్ జోన్, ఆర్ట్ రూం అందుబాటులో ఉంది. జూబ్లీహిల్స్ లోని ఆటమ్ లీఫ్ కెఫే పచ్చని వాతావరణంలో ఉంటుంది. లాస్ట్ హౌస్ కెఫే దుర్గం చెరువు సరస్సు ఒడ్డున ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ కెఫేలు సాధారణంగా హై- స్పీడ్ వై – ఫై, చార్జింగ్ సాకెట్లు, కాఫీ, స్నాక్స్ అందిస్తున్నాయి. సత్య నాలెడ్జ్ సిటీలోని సుబ్ కో ప్రత్యేకంగా వర్క్ ఫ్రం కెఫే సెటప్‌ను అందిస్తుంది.
ఇందులో ప్లగ్ పాయింట్లు, డెస్క్‌లు, హై – స్పీడ్ వై – ఫై ఉన్నాయి. దీని ప్యాకేజీ ధరలు రూ.1500 నుంచి ప్రారంభమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌లలో పనిచేసుకునేవారికి కొన్ని కెఫేలు గంటలు లేదా ఒక రోజుకి అనుమతిస్తూ పాస్‌లను అందిస్తున్నాయని సత్యనాలెడ్జ్ సిటీలోని సుబ్ కోకెఫే ఎగ్జిక్యూటివ్ కేతన చెప్పారు.
వర్క్ ఫ్రం హోంకు ప్రత్యామ్నాయంగా…
కరోనా తర్వాత రిమోట్, హైబ్రిడ్ వర్క్ విధానాలు పెరగడంతో ఉద్యోగులు ఇంటి వాతావరణానికి ప్రత్యామ్నాయంగా కెఫేలను ఎంచుకుంటున్నారు. ఇంట్లో ఉండే అంతరాయాలు లేకుండా, ఇతర ప్రొఫెషనల్స్ మధ్య పనిచేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుందని ఐటీ ఉద్యోగి అనిల్ కుమార్ చెప్పారు.
కెఫేల్లో జరిగే అనధికారిక నెట్‌వర్కింగ్ కూడా ఈ ట్రెండ్‌కు బలం చేకూరుస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, యూట్యూబర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు తమ రోజువారీ పనిలో కొంత భాగాన్ని కెఫేల నుంచే నిర్వహిస్తున్నారు. కొన్ని స్టార్టప్ బృందాలు సమావేశాలు, బ్రెయిన్‌స్టార్మింగ్ సెషన్ల కోసం కూడా కెఫేలను ఉపయోగిస్తున్నాయి.