
హైదరాబాద్ శివార్లలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టయింది. శంషాబాద్ టాస్క్ ఫోర్స్ , ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 56 లక్షల విలువైన 110 కిలోల గంజాయితో పాటు, రెండు కార్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు.
పోలీసుల కళ్ళు గప్పేందుకు ఈ ముఠా అత్యంత పక్కా స్కెచ్ వేసింది. స్మగ్లింగ్ కోసం టాటా హారియర్, మారుతి ఎర్టిగా వాహనాలను ఉపయోగించారు. ఇందులో ఒక కారును పైలట్ వాహనంగా ముందు పంపుతూ… పోలీస్ చెక్‌పోస్టుల సమాచారాన్ని వెనుక వచ్చే కారుకు ఎప్పటికప్పుడు చేరవేసేవారు. టోల్ గేట్లలో దొరకకుండా ఉండేందుకు నకిలీ మహారాష్ట్ర నెంబర్ ప్లేట్లను వాడటమే కాకుండా… పోలీస్ నిఘా తప్పించుకోవడానికి కేవలం ఇంటర్నెట్ కాలింగ్ మాత్రమే ఉపయోగించారు.అయినప్పటికీ, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు… బొంగులూరు ఓఆర్ఆర్ (ORR) గేట్ సమీపంలో వ్యూహాత్మకంగా ఈ రెండు వాహనాలను అడ్డుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన ప్రభిత్ర ప్రధాన్ అనే సరఫరాదారు నుంచి… కేవలం కిలో నాలుగు వేల రూపాయలకే గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రలో కిలో రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ప్రణవ్ సింగ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.