
‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ దర్శకుడు కె. భాగ్యరాజ్ (K Bhagyaraj) ఆకస్మిక మృతి.. సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కేవలం తమిళంలోనే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారు. తన 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్, 25 సినిమాలకు దర్శకత్వం వహించి ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’గా భారతీయ సినీ రికార్డులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
ముఖ్యంగా భాగ్యరాజ్.. తన సినిమాల్లో కుటుంబ కథలు, ప్రేమ, హాస్యం, సామాజిక అంశాలను సమతుల్యంగా మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రత్యేక శైలి ఉండేది. వాటికి సహజమైన పాత్రలను క్రియేట్ చేసి, చమత్కారమైన డైలాగ్స్తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇక ఆయన నటుడిగా పోషించిన పాత్రలు సాధారణ మనుషుల జీవితాలకు దగ్గరగా ఉండేవి. రీసెంట్ టైమ్స్లో తెలుగులో ‘35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి సినిమాల్లో నటించాడు. ఒక రచయితగా మొదలై దర్శకుడిగా, నటుడిగా భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన కె.భాగ్యరాజ్.. ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించడం సినీ ప్రపంచానికి తీరని లోటును మిగిల్చింది.
ఎవరు ఈ కె. భాగ్యరాజ్?
ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం సమీపంలోని వెల్లాంకోయిల్ గ్రామంలో కృష్ణస్వామి-అమరావతి దంపతులకు మూడో కుమారుడిగా భాగ్యరాజ్ జన్మించారు. ఆయన తొలి భార్య ప్రవీణా అనారోగ్యంతో మరణించగా, అనంతరం అప్పటి ప్రముఖ నటి పూర్ణిమను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శరణ్య అనే కుమార్తె, శాంతను అనే కుమారుడు ఉన్నారు.
సినీ ప్రయాణం ఎలా మొదలైంది..
1977లో దిగ్గజ దర్శకుడు భారతిరాజా తెరకెక్కించిన తమిళ క్లాసిక్ ఫిల్మ్ ‘పదహారేళ్ల వయసు’ ద్వారా సహాయ దర్శకుడిగా భాగ్యరాజ్ సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘తూర్పు వెళ్లే రైలు’ చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అదే సినిమాలో నటుడు గౌండమణితో కలిసి ఒక చిన్న పాత్రలో కనిపించారు.
భారతిరాజా దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర గులాబీలు’ చిత్రంలో చిన్న పాత్ర పోషించడంతో పాటు, ఆ సినిమాకు డైలాగ్స్ కూడా రాసి విలక్షణ రైటర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన భారతీరాజా నుంచి వచ్చిన మరో ‘కొత్త జీవితం’ చిత్రంలో భాగ్యరాజ్‌ను కేవలం రచయితగానే కాకుండా హీరోగా కూడా భారతిరాజా పరిచయం చేశారు. ఇలా డైరెక్టర్ భారతిరాజా.. ఒక గురువుగా భాగ్యరాజ్ను తీర్చిదిద్ది సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.
డైరెక్టర్గా సక్సెస్ ఫుల్ జర్నీ..
1979లో విడుదలైన ‘సువర్ ఇల్లాథ చిత్రంగళ్’ చిత్రంతో భాగ్యరాజ్ దర్శకుడిగా మారారు. అనంతరం ‘ఇంద్రు పోయి నాలై’, ‘అంద 7 నాట్కల్’ (తెలుగులో రాధా కళ్యాణం), ‘తూరల్ నిన్ను పోచు’, ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘పోయ్ సాచి’, ‘ముందానై ముడిచ్చు’(తెలుగులో మూఢు ముళ్లు), ‘విధి’, ‘అవసర పోలీస్ 100, ‘చిన్న వీడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. హాస్యం, వ్యంగ్యం, చమత్కార సంభాషణలు ఆయన చిత్రాల ప్రత్యేకతగా నిలిచాయి. అంతేకాకుండా సామాజిక న్యాయం, కుల, మత వివక్ష వ్యతిరేక భావజాలాన్ని కూడా తన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరవేశారు.
తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సినిమాలు..
చిలిపి పెళ్లాం (1990), మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004), పెళ్ళైంది కానీ (2007) వంటి సినిమాలకు దర్శకుడిగా డైరెక్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాడు. వెంకటేష్ క్లాసిక్ హిట్స్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘అబ్బాయిగారు’, నాగార్జున ‘ఆఖరిపోరాటం’ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులుగా నిలిచారు. నటుడిగా మేం వయసుకు వచ్చాం (2012), డిటెక్టివ్ (2017), అల్లంత దూరాన (2023), 35 చిన్న కథ కాదు (2024), కుబేర (2025) వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.