
హైదరాబాద్ మెట్టిపల్లిలో దారుణం జరిగింది. కొత్త ఇంటి గృహప్రవేశం జరుగుతున్న సమయంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులు,బంధువులపై విచక్షణ లేకుండా దాడి చేశారు. శనివారం ( జూన్ 27 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ లోని దేవేందర్ నగర్ లో జరిగింది ఈ ఘటన. ఈ దాడిలో వృద్ధులు, మహిళలు, పిల్లలకు, గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో దేవేందర్ నగర్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది. గృహ ప్రవేశానికి వస్తున్న ఇంటి ప్రక్కనే ఉన్న ఓ రిపోర్టర్ ఈ సంఘటన సోషల్ మీడియాలో వేసినందుకు గాను రిపోర్టర్ కారును ధ్వంసం చేసి, ఇంటిపై దాడికి యత్నం చేశారు. దాడికి పాల్పడిన గ్యాంగ్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ గ్యాంగ్ స్థానికంగానే ఉంటూ గంజాయి సేవిస్తూ, రౌడీయిజం చేస్తారంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు, విచారణ చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.