
Dil Raju: టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. భారీ చిత్రాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు ఇండస్ట్రీలో ఆయన తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నిజానికి ఆయన.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం, అంకితభావం ఉన్నాయి. తాజాగా ఆయన తన లైఫ్ జర్నీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఆటోమొబైల్ రంగంలో ఆయన చేసిన వ్యాపారం, ఎదుర్కొన్న ఒడిదొడుకులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తన కెరీర్‌ను ఆటోమొబైల్ బిజినెస్‌తో ప్రారంభించినట్లు వెల్లడించారు. “అది 1985వ సంవత్సరం.. మా బ్రదర్ పెద్ద నరసింహా రెడ్డి గారికి హైదరాబాద్‌లోని గ్యాస్ మండి (ఆర్పీ రోడ్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్లే దారి) లో ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ షాప్ ఉండేది. నేను హైదరాబాద్ వచ్చాక మా బ్రదర్‌తో కలిసి ఆ బిజినెస్‌లో జాయిన్ అయ్యాను. 1985 నుంచి 1999 వరకు దాదాపు 14 ఏళ్లు అదే వ్యాపారంలో ఉన్నాను. నా లైఫ్‌లో అది మొదటి బిజినెస్ కావడంతో ఎంతో ప్యాషన్‌తో చేసేవాడిని. స్పేర్ పార్ట్స్ కోసం ఆర్పీ రోడ్ నుంచి సిద్దంబర్ బజార్ వరకు దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్లి తెచ్చేవాడిని. టీనేజ్ వయసు కావడంతో ఆ కష్టాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ అవ్వాలనే కసిగా వర్క్ చేసేవాడిని” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
సినిమా ఫీల్డ్‌లో ఫెయిల్యూర్స్.. బ్యాకప్‌గా ఆటోమొబైల్
1996లో సినిమా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినట్లు దిల్ రాజు తెలిపారు. అయితే సినిమాల్లో సక్సెస్ అయ్యే వరకు ఆటోమొబైల్ బిజినెస్‌ను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. “సినిమాల్లో ఫెయిల్ అయితే వెనక్కి వెళ్లిపోవడానికి ఒక బ్యాకప్ ఉండాలని అటు ఆటోమొబైల్స్, ఇటు సినిమాలు రెండింటిలోనూ ఉన్నానని చెప్పారు. తర్వాత పూర్తి స్థాయిలో సినిమా వైపు వచ్చినట్లు వెల్లడించారు. సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది అనేదానిపై ఆయన స్పందిస్తూ.. చిన్నప్పుడే తనకు తెలియకుండానే సినిమాలతో కనెక్షన్ ఏర్పడిందని వెల్లడించారు. “హైదరాబాద్ రాకముందే మా విలేజ్ లో మనీ సంపాదించడం కోసం 16 mm ప్రొజెక్టర్, స్క్రీన్ తెచ్చి ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసేవాళ్ళం. ఆ తర్వాత VHS క్యాసెట్లు, టీవీ పెట్టి కూడా షోలు వేశాం. నా ఫస్ట్ కజిన్ శిరీష్ (Sirish) బుకింగ్స్ చూసుకుంటే, నేను గేట్ దగ్గర నిలబడి ఒక రూపాయి, యాభై పైసల టికెట్లు కలెక్ట్ చేసేవాడిని. అప్పట్లో చిరంజీవి గారి ‘సింహపురి సింహం’, అశ్విని గారి ‘అనాదిగా ఆడది’ లాంటి దాదాపు 10 సినిమాలు అలా స్క్రీనింగ్ చేశాం. అప్పుడు సినిమాలపై ఇంట్రెస్ట్ కంటే కూడా మనీ కోసమే ఒక వ్యాపారంగా దాన్ని ట్రై చేశాం” అంటూ దిల్ రాజు తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దిల్ రాజు తన ప్రస్థానం గురించి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.