Reading Time: 2 minutes
Crispy Raw Potato Paratha Recipe Make Delicious Aloo Parathas Without Boiling Potatoes

Crispy Raw Potato Paratha Recipe: ఉదయం అల్పాహారానికి త్వరగా, రుచికరంగా, కడుపు నిండే వంటకం కావాలంటే పచ్చి ఆలూ పరాఠా మంచి ఎంపిక. సాధారణంగా ఆలూ పరాఠా తయారు చేయాలంటే ముందుగా బంగాళదుంపలను ఉడికించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక రెసిపీలో ఆ అవసరం లేదు. పచ్చి బంగాళదుంపలతోనే కరకరలాడే, రుచికరమైన పరాఠాలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ పరాఠా బయట కరకరలాడుతూ, లోపల మసాలాల రుచితో ఎంతో రుచిగా ఉంటుంది. అల్పాహారంతో పాటు పిల్లల లంచ్‌బాక్స్‌కు, రాత్రి భోజనానికి కూడా ఇది చక్కని ఎంపిక. ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నిస్తే ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు అంటే నమ్మండి..

కావలసిన పదార్థాలు (ఇద్దరికి)

* 2 పెద్ద బంగాళదుంపలు
* 2 కప్పుల గోధుమ పిండి
* 4-5 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
* 2 టేబుల్ స్పూన్ల శనగపిండి
* 1 టీస్పూన్ కారం పొడి
* అర టీస్పూన్ పసుపు
* 1 టీస్పూన్ కసూరి మెంతి
* అర టీస్పూన్ సోంపు
* తగినంత ఉప్పు
* కాల్చడానికి నూనె లేదా నెయ్యి

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత బంగాళదుంపలను కడిగి తొక్క తీసి తురమాలి. ఈ తురుమును పిండిలో వేసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సోంపు, కసూరి మెంతి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తని పిండిలా కలపాలి. బంగాళదుంపల నుంచి కూడా తేమ వస్తుంది కాబట్టి అవసరమైనంత మాత్రమే నీటిని ఉపయోగించాలి. పిండిపై కొద్దిగా నూనె రాసి, మూతపెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసి, పొడి పిండి చల్లి గుండ్రంగా ఒత్తాలి. వేడి పెనంపై పరాఠాను వేసి రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత నూనె లేదా నెయ్యి రాసి బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. పరాఠా కరకరలాడేలా వేయించుకుంటే మరింత రుచిగా ఉంటుంది. వేడి వేడి పచ్చి ఆలూ పరాఠాను టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, పెరుగు లేదా ఊరగాయతో వడ్డిస్తే అద్భుతమైన రుచి ఆస్వాదించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచిని అందించే ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి.