
TG20 League: టీజీ20 లీగ్ 2026 లో కరీంనగర్ డైమండ్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం వరంగల్ వారియట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కరీంనగర్ 2 పరుగుల స్వల్ప తేడాతో ఘన విజయం సాధించింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 రన్స్ వద్దే నిలిచిపోవడంతో కరీంనగర్ విజయం నల్లేరుపై నడకలా మారింది.
తన్మయ్ అగర్వాల్ సూపర్ సెంచరీ:
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ డైమండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 133 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్ సాత్విక్ రెడ్డి (4) తొలి ఓవర్లోనే అవుట్ అయినా.. తన్మయ్ మాత్రం మిగతా బ్యాటర్ల సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. హృషికేష్ సింహా (24), చందన్ సహాని (16), రాహుల్ రాడేశ్ (15*) పరుగులు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. కాగా వరంగల్ బౌలర్లలో ముదస్సిర్ హుస్సేన్ 2 వికెట్లు తీయగా, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలో వికెట్ పడగొట్టారు.
►ALSO READ | మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ స్పెషల్ అపియరెన్స్.. అనుష్కతో కలిసి మ్యాచ్ చూసిన కింగ్
రిషికేత్, భవేష్ పోరాడినా తప్పని ఓటమి!
210 పరుగుల భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన వరంగల్ వారియర్స్ జట్టు చివరి వరకు అద్భుతంగా పోరాడింది. రిషికేత్ సిసోడియా కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 65 పరుగులతో దుమ్మురేపాడు. మరోవైపు భవేష్ సేథ్ 27 బంతుల్లో 6 సిక్సర్లతో 53 రన్స్ తో నాటౌట్‌గా నిలిచి ఆఖరి వరకు జట్టును గెలిపించేందుకు గట్టిగా శ్రమించాడు. హర్షిత్ చౌదరి (31), శౌనక్ కులకర్ణి (14*) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు మాత్రం చేర్చలేకపోయారు.
కరీంనగర్ సూపర్బ్ బౌలింగ్:
కరీంనగర్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా సతీష్ కుమార్ 2 వికెట్లతో కీలకమైన బ్రేక్ త్రూలు అందివ్వగా.. శుభమ్ శర్మ, దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ్ తలో వికెట్ తీసి వరంగల్ విజయానికి బ్రేకులు వేశారు. దీంతో కేవలం రెండు అంటే రెండే పరుగుల దూరంలో వరంగల్ వారియర్స్ జట్టు ఓడిపోయింది.