Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi India Vs Ireland 1st T20 Playing Xi Debut Sitanshu Kotak

Vaibhav Sooryavanshi- Sitanshu Kotak: ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌లో శుక్రవారం (జూన్ 26) జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటాడా లేదా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సస్పెన్స్‌పై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మొదటిసారి నోరు విప్పారు. వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఖచ్చితంగా అవకాశం వస్తుందని, అయితే కేవలం అతనితో అరంగేట్రం (డెబ్యూ) చేయించడం కోసం.. జట్టులో నిలకడగా రాణిస్తున్న ఏ ఆటగాడిని పక్కనబెట్టే ప్రసక్తే లేదని కోటక్ స్పష్టం చేశారు. బలమైన ప్లేయింగ్-11ను బరిలోకి దించడమే జట్టు ప్రథమ లక్ష్యమన్నారు. ఒకవేళ బెల్‌ఫాస్ట్ టీ20లో వైభవ్‌కు అవకాశం వస్తే, భారత పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా అతను సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.

వైభవ్ అసాధారణ ప్రతిభావంతుడు

మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోటక్, వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ యువ బ్యాట్స్‌మెన్ టాలెంట్‌పై ఎలాంటి సందేహాలు లేవన్నారు. ఐపీఎల్‌తో పాటు ఇతర టోర్నమెంట్లలో అతను బ్యాటింగ్ చేసిన తీరు అతని సహజ సామర్థ్యాన్ని తెలియజేస్తుందని, జోఫ్రా ఆర్చర్ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎదుర్కొన్నాడని, వైభవ్ ఓ అసాధారణ ప్రతిభావంతుడని కొనియాడారు. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన జట్టులో తక్షణమే చోటు దక్కుతుందనే గ్యారెంటీ లేదని కోటక్ స్పష్టం చేశారు. తుది నిర్ణయం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటారని చెప్పారు. “కెప్టెన్, హెడ్ కోచ్ జట్టును ఖరారు చేస్తారు. ఒకవేళ వైభవ్ ఆడితే చాలా మంచిది, ఆడకపోయినా ఇబ్బంది లేదు.. ఎందుకంటే అతను ఇప్పటికే భారత జట్టులో భాగమయ్యాడు, త్వరలోనే అతనికి అవకాశం వస్తుంది. కానీ కేవలం అతనికి ఛాన్స్ ఇవ్వడం కోసం ఇప్పటికే రాణిస్తున్న ఆటగాళ్లను తొలగించలేము” అని కోటక్ అన్నారు. ప్రదర్శన ఆధారంగా జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడికి అన్యాయం చేయాలని మేనేజ్‌మెంట్ భావించడం లేదని, కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడానికి, పాత ఆటగాడికి న్యాయం చేయడానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వైభవ్‌కు ప్రత్యేక మర్యాదలేమీ ఉండవు

కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైనప్పటికీ వైభవ్‌కు జట్టులో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేదా సదుపాయాలు ఉండవని కోటక్ చెప్పారు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా తన ఆటను ఆస్వాదించాలనేదే మేనేజ్‌మెంట్ కోరుకుంటోందని తెలిపారు. బీసీసీఐ అండర్-19, ఇండియా-ఎ వ్యవస్థల నుంచి వచ్చే ఆటగాళ్లకు భారత సీనియర్ జట్టు సంస్కృతిపై ముందే అవగాహన ఉంటుంది కాబట్టి, వారందరితో కలిసిపోవడం వైభవ్‌కు పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు. అలాగే.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వైభవ్‌కు కీలక సలహా ఇచ్చారని కోటక్ వెల్లడించారు. జట్టులో తనను తాను వేరుగా చూసుకోవద్దని గంభీర్ చెప్పినట్లు తెలిపారు. “ఈ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించమని మాత్రమే మేము అతనికి చెప్పాం. ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏదైనా అడగాలన్నా సంకోచించవద్దని అన్నాం. గౌతమ్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. ఇది నీ సొంత జట్టు లాంటిదేనని, ఎలాంటి భయం లేకుండా నీ ఆటను ప్రదర్శించమని వైభవ్‌కు ధైర్యం చెప్పారు” అని కోటక్ వివరించారు.