Reading Time: 2 minutes
Nimmala Rama Naidu Counter To Jagan On Veligonda Project

Nimmala Ramanaidu : “రాష్ట్రంలో ఎలాంటి క్రెడిట్ లేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన క్రెడిట్లను మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చోరీ చేయలేరు. ఎందుకంటే హత్యలు, దోపిడీలు, గొడ్డలి పోట్లు, నిరంతర అసత్యాలు మాట్లాడటమే ఆయనకున్న అసలైన క్రెడిట్” అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జరిగిన దగాను లెక్కలతో సహా ఎండగట్టారు.

పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితమా?

పనులు ఇంకా ఎంతో మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికారని మంత్రి రామానాయుడు మండిపడ్డారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా రైతులను జగన్ ఘోరంగా మోసం చేశారని, తన సొంత పత్రిక, టీవీ ఛానళ్ల ద్వారా టన్నుల కొద్దీ అబద్ధాలను అచ్చేయించి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పరిధిలోని భూ నిర్వాసితులకు రూ. 900 కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా, గత ఐదేళ్లలో వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టన్నెల్-2 లో 12వ కిలోమీటర్ వద్ద విరిగిపోయి చిక్కుకున్న టీబీఎం (TBM – టన్నెల్ బోరింగ్ మెషిన్)ను తొలగించకుండా చుక్క నీరు కూడా ఇవ్వలేమని తెలిసినప్పటికీ, గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రాజెక్టును గాలికొదిలేసిందని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న పనులు

ముప్పై ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు నాడు భూమి పూజ చేసిన నారా చంద్రబాబు నాయుడే, ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల సాగు, తాగు నీటి కల నెరవేర్చబోతున్నారని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత ముగింపు లభిస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో హైకోర్టు అనుమతితో టన్నెల్-2 లో చిక్కుకున్న టీబీఎం తొలగింపు పనులను అత్యంత వేగంగా చేపట్టామని వివరించారు. అలాగే టన్నెల్-1 లో అడ్డుగా పేరుకుపోయిన 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ (వ్యర్థాలు) తొలగింపు పనులలో భాగంగా ఇప్పటికే 40 వేల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు.

పునరావాసానికి రూ. 903 కోట్లు.. ప్రాజెక్టు పూర్తికి రూ. 3,844 కోట్లు అవసరం

నల్లమలసాగర్‌కు పూర్తి స్థాయిలో నీళ్లు నింపడానికి , నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం అదనపు బడ్జెట్‌లో రూ. 903 కోట్లు కేటాయించిందని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పనులన్నీ సంపూర్ణంగా పూర్తి కావాలంటే ఇంకా రూ. 3,844 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. జగన్ రెడ్డి లాగా కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా, నిధులు కేటాయించి క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.