Reading Time: 2 minutes
భరత్ తివారీ ఎన్‌కౌంటర్‌‌లో వెలుగులోకి సంచలనాలు.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు..!

బీహార్‌లోని భోజ్‌పూర్‌లో జరిగిన భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వెలువడిన భరత్ తివారీ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి రావడంతో, ఈ ఎన్‌కౌంటర్ అసలు నిజమైనదేనా లేక బూటకమా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఐఏఎన్ఎస్ (IANS) వార్తా సంస్థ కథనం ప్రకారం.. భరత్ తివారీ శరీరంలోకి ఒకటి, రెండు కాదు, ఏకంగా ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయని పోస్ట్‌మార్టం నివేదిక నిర్ధారించింది. బుల్లెట్లు తగిలిన గాయాల స్పష్టంగా ఉన్నాయి. మొదటి బుల్లెట్.. ముందు వైపు నుండి ఎడమ తొడ పైభాగానికి తగిలింది. రెండవ బుల్లెట్ ఎడమ తొడ లోపలి మధ్య భాగానికి, మూడవ బల్లెట్ కుడి తొడ లోపలి మధ్య భాగానికి తగిలాయి. ఇఖ నాలుగో బుల్లెట్ కుడి తొడకు బయటి వైపు నుంచి లోపలికి దూసుకెళ్లింది. ఐదో బుల్లెట్.. ఎడమ కాలి మధ్య భాగానికి వెనుక వైపు నుంచి తగిలింది. బుల్లెట్లు తగిలిన తీరును బట్టి చూస్తే, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కాల్పులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్ వ్యవహారం బీహార్‌లో తీవ్ర రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు నిరంతరం నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఆధ్యాత్మిక వేత్త దేవకినందన్ ఠాకూర్ స్పందిస్తూ.. “పదేళ్ల క్రితం అతను కేవలం ఒక సామాన్య యువకుడు…” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, ప్రజల్లో తలెత్తిన అనుమానాల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పాట్నాలో నిర్వహించిన ‘రాజ్యాంగ హత్య దినోత్సవం’ వేదికగా ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి కీలక ప్రకటన చేశారు. భోజ్‌పూర్ ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని, తక్షణమే ఒక ఉన్నత స్థాయి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. “ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విచారణలో ఎవరైనా దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు సకాలంలో న్యాయం, పారదర్శకమైన పరిపాలన అందించడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత.” అని సీఎం సమ్రాట్ చౌదరి అన్నారు.

ఇదే వేదికపై నుంచి అధికారులకు సీఎం సామ్రాట్ చౌదరి గట్టి హెచ్చరిక జారీ చేశారు. బాధితుల దరఖాస్తులపై 30 రోజుల్లోగా అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని, ఒకవేళ నిర్లక్ష్యం వహించి 31వ రోజుకు చేరితే సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా ఉత్తర్వులు వస్తాయని స్పష్టం చేశారు. న్యాయ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…