Reading Time: < 1 minute
Sridhar Reddy: రొట్టెల పండుగ సాక్షిగా.. నెల్లూరు రూరల్ పొలిటికల్ సస్పెన్స్‌కు తెరదించిన కోటంరెడ్డి!

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగలో ఒక ఆసక్తికర రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. ఏటా ఐదు రోజుల పాటు రాష్ట్ర పండుగగా ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకల్లో.. ఈసారి రాజకీయ ఊహాగానాలకు తెరదించేలా ఒక పరిణామం కనిపించింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు తమ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ‘ఎమ్మెల్యే రొట్టె’ అందించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవాల్లో బారాషహీద్ దర్గాను దర్శించుకుని, స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవడం ఆనవాయితీ. ఉద్యోగం, వివాహం, సంతానం, సొంత ఇల్లు వంటి రకరకాల కోరికల కోసం భక్తులు ఇక్కడ రొట్టెలు ఇచ్చు పుచ్చుకుంటారు. కోరిక నెరవేరిన వారు మరుసటి ఏడాది వచ్చి, మళ్లీ ఆ కోరిక ఉన్నవారికి రొట్టెను తిరిగి ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం.

అయితే నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. కోటంరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండగా.. ఇటీవల కోటంరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర ఊహాగానాలు చెలరేగాయి.

వారసుడు తమ్ముడా? లేక కుమార్తెనా? అనే సందిగ్ధతకు రొట్టెల పండుగ వేదికగా కోటంరెడ్డి దంపతులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. తమకు తీరిన ‘ఎమ్మెల్యే రొట్టె’ను తమ్ముడు గిరిధర్ రెడ్డికి అందించి, వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు. మా పిల్లలతో సమానంగా గిరిధర్ రెడ్డిని చూస్తాం. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనేదే మా కుటుంబ కోరిక అని కోటంరెడ్డి దంపతులు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.