
షాకుల మీద షాకులు తగిలాక గానీ…. ఆ మంత్రిగారికి తత్వం బోధపడలేదా? పునాదులు కదులుతున్న సంకేతాలతో అలర్ట్ అయిపోయారా? ఇప్పటికే పరిస్థితి చేయి దాటి పోయిందా? లేక అదుపులోనే ఉందా? ఆఖరి ప్రయత్నంగా అమాత్యులు చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఫలితం ఇస్తాయా? ఎవరా ఏపీ మినిస్టర్? ఏంటి ఆ షాక్‌లు, సవరణల కథ?
పొలిటికల్ పదవులు రావడం ఎంత కష్టమో….. వాటిని నిలబెట్టుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ వాస్తవం ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. అయినాసరే… ఒక్కోసారి వోవర్ కాన్ఫిడెన్స్‌తోనో… నిర్లక్ష్యంగానో తప్పటడుగులు పడుతుంటాయి కొందరికి. ప్రస్తుతం అదే రూట్లో ఉన్నారట ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఆయన బీజేపీలో ఒక కీలకమైన నేత మాత్రమే. పార్టీ జాతీయ రాజకీయాల్లోనే ఆయన పేరు అడపాదడపా వినిపించేది. కానీ… ఎన్నికలకు ముందు స్టేట్ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయిపోయి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. కూటమి పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ని కాదని సత్యకుమార్‌కు బీజేపీ తరపున టికెట్ ఇచ్చారు. ఇక ఒకేసారి గెలుపుతోపాటు మంత్రి పదవి కూడా దక్కింది. అంత వరకు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న టైంలో… లోకల్‌గా మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవడం మొదలయ్యాయట. ఓవైపు రాష్ట్ర మంత్రిగా, మరోవైపు ఏపీ బీజేపీలో కీలకంగా ఉండటంతో… ధర్మవరం నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంతో పీఏల పెత్తనం పెరిగిపోయి నియోజకవర్గంలో బాగా బ్యాడ్ అవుతున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. మంత్రులు ఇతర ముఖ్యమైన నాయకులు రకరకాల వ్యవహారాల్లో సహజంగానే బిజీగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో తమ బేస్‌లో పట్టు తగ్గకుండా నమ్మకమైన వ్యక్తుల్ని పీఏలుగా నియమించుకోవడం, వాళ్ళతో లోకల్ వ్యవహారాలు చక్కబెట్టడం కొత్తేమీకాదు. మంత్రి సత్యకుమార్ కూడా ధర్మవరంలో అదే పని చేసినా… పీఏలే పెద్ద సమస్యగా మారారన్నది పొలిటికల్ టాక్. ఇక్కడ మినిస్టర్‌కంటే ఎక్కువగా వాళ్ళే హడావిడి చేస్తున్నారట. దాంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అటు మిత్ర పక్షం టీడీపీ నాయకులు కూడా ఆగ్రహంగా ఉన్నారట. ఈ క్రమంలో సత్య కుమార్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ హైకోర్టు న్యాయవాదిపై కొందరు దాడి చేశారు. ఆ ఘటనతో ధర్మవరం పాలిటిక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. మంత్రి సొంత సెగ్మెంట్ ధర్మవరం కాకపోవడంతో అదే పాయింట్‌ని రెయిజ్ చేస్తూ… ప్రశ్నిస్తున్నారు కొందరు. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు ఇక్కడ మాపై దాడులు చేస్తారా అంటూ పాత బీజేపీ లీడర్స్ బయటకు వచ్చారు. దీంతో లోకల్… నాన్ లోకల్ అన్న తేడాలు వచ్చాయి. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ పాలన సాగడం లేదని, ఆయన పీఏల పాలన నడుస్తోందని కామెంట్ చేశారు.
ఇలా వరుస ఘటనలతో… మొదటికే మోసం వస్తుందని గ్రహించిన సత్యకుమార్ అలర్ట్ అయ్యారట. ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా ప్రస్తుతం తన షెడ్యూల్ మార్చుకుని నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో వారానికి రెండు మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వివాదాలకు కారణం అవుతున్న పీఏలను పక్కనపెట్టి తానే స్వయంగా డీల్ చేస్తున్నారన్నది సన్నిహితుల మాట. మొత్తం మీద సార్‌కి రెండేళ్ళకుగాని తత్వం బోథపడలేదంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి ధర్మవరం బీజేపీలో.