
నెట్వర్క్, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అధికారులకు సూచించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రంగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయాలయంలో ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వీకరించి, స్వయంగా పూర్తి చేసి బీఎల్‌ఓకు అందజేశారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు సక్రమంగా నమోదై ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులకు సరైన వివరాలు అందించి సహకరించాలని ఆయన సూచించారు.నారాయణపేటలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కే రన్‌ను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక జెండా ఊపి ప్రారంభించారు.
గద్వాలలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇంటింటి సర్వేను స్వయంగా పరిశీలించి 2కే రన్ లో పాల్గొన్నారు. నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఓటర్ల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నమోదు కాకుండా చూడాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ నర్సాపూర్, అచ్చంపేట గ్రామాల్లో పర్యటించి, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, చిన్నచింతకుంట మండలాల్లోని కార్యక్రమాల్లో అడిషనల్కలెక్టర్లు పాల్గొన్నారు.