Reading Time: < 1 minute
India Rejects Pakistans Karachi Attack Allegations Urges Action Against Terror Networks

MEA: ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్ రేంజర్స్ స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే, ఈ దాడి వెనక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. ఇతరుల వైపు వేలెత్తి చూపేటప్పుడు సొంత దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్‌లపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు భారత్ సూచించింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. కరాచీ ఘటనకు సంబంధించి భారత్‌పై పాక్ మీడియా చేస్తున్న అన్ని ఆరోపణల్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్ ఇతరుల్ని నిందించడం మానేసి, తన భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానాల్లో ఉపయోగించే ధోరణిని విడిచిపెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

శనివారం సాయంత్రం కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ భిట్టై వింగ్ ప్రధాన కార్యాలయంపై భారీ ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ప్రధాన గేటును వాహనంతో ఢీకొట్టి గ్రెనేడ్లు విసిరి, కాల్పులు జరిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు రేంజర్స్ సిబ్బంది మరణించగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ బాధ్యత వహించింది.