Reading Time: < 1 minute
Divija Prabhakar Said Venkatramayya Gaari Thaluka Will Connect With Every Family

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరోగా దినేష్ కుమార్, హీరోయిన్‌ దివిజ ప్రభాకర్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ వంటి భావోద్వేగ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది.

హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘జయమ్మ పంచాయితీ తర్వాత నేను చేసిన మరో మంచి సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఇందులో ఉంది. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు ప్రాణం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే చిత్రం అవుతుంది’ అని అన్నారు. హీరోయిన్ దివిజ మాట్లాడుతూ.. ‘అందరికీ నచ్చే కథ ఇది. ప్రతి ఒక్కరూ ఎంతో మనసుపెట్టి పని చేశారు. నిర్మాత కోమలి గారు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18న థియేటర్లలో ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

వెంకట్రామయ్య గారి తాలూకా చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, సీనియర్ నటుడు కాశి విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ, హాసిని, యూట్యూబర్స్ జీవన్‌ప్రియ, గౌరి నాయుడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను సతీష్ ఆవాల నిర్వహించగా.. చరణ్ అర్జున్, చిరంజన్ సంగీతం అందించారు. కుటుంబ విలువలను హృద్యంగా చెప్పే ఈ చిత్రం ప్రేక్షకులకు భావోద్వేగ అనుభూతిని అందించనుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.