
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ పేమెంట్లు, క్రిప్టోకరెన్సీలు, అత్యాధునిక ఫైనాన్షియల్ మార్కెట్లు ఎంతగా దూసుకుపోతున్నా.. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు మాత్రం మళ్లీ పాత కాలం నాటి పసిడి వైపే మొగ్గు చూపుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గ్లోబల్ రేంకింగ్స్ ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
అమెరికాదే అగ్రస్థానం..
ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశంగా అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా వద్ద ఏకంగా 8వేల 133 టన్నుల బంగారం ఉంది. ఈ నిల్వలు ఎంత భారీ స్థాయివంటే.. రెండో స్థానంలో ఉన్న జర్మనీ కంటే ఇవి రెండింతలు ఎక్కువ. అంతేకాదు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఉమ్మడి నిల్వలను కలిపినా అమెరికా గోల్డ్ రిజర్వ్స్‌తో సమానమవుతాయి. ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాల వద్దే ప్రపంచంలోని మొత్తం బంగారు నిల్వలలో 60 శాతానికి పైగా ఉండడం గమనార్హం.
టాప్-6 దేశాల లిస్ట్ ఇదే:
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిల్వలు కలిగిన మొదటి ఆరు దేశాల వివరాలు..
1.అమెరికా: 8,133.5 టన్నులు
2. జర్మనీ: 3,351.6 టన్నులు
3. ఇటలీ: 2,451.9 టన్నులు
4. ఫ్రాన్స్: 2,437.0 టన్నులు
5. రష్యా & చైనా: ఈ రెండు దేశాలు ఒక్కొక్కటి 2,200 టన్నులకు పైగా బంగారాన్ని కలిగి ఉన్నాయి.
ఇటీవలి కాలంలో చైనా పసిడి నిల్వలను పెంచడంపై గ్లోబల్ మార్కెట్లలో ప్రత్యేక చర్చ నడుస్తోంది. 2019 నుండి 2024 మధ్య కాలంలో చైనా ఏకంగా 331 టన్నుల బంగారాన్ని అదనంగా కొనుగోలు చేసింది. చైనాతో పాటు పోలాండ్, టర్కీ దేశాలు కూడా తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయి.
8వ స్థానంలో భారత్..
ఈ ప్రపంచ రేంకింగ్స్‌లో భారతదేశం ఒక కీలకమైన ప్లేయర్‌గా అవతరించింది. ప్రస్తుతం భారత సెంట్రల్ బ్యాంక్ వద్ద 876.2 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఈ భారీ నిల్వలతో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల కంటే కూడా భారత్ ముందంజలో ఉండడం విశేషం. సాంప్రదాయ కరెన్సీ ఆస్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, రిజర్వ్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా మార్చుకోవడానికి భారత్ గత కొన్ని సంవత్సరాలుగా బంగారాన్ని వేగంగా కొంటున్న సంగతి తెలిసిందే.
కేవలం పెద్ద దేశాలే కాకుండా ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, కజకిస్తాన్, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలు కూడా తమ బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటూ పోతున్నాయి. సాంకేతికత ఎంత మారినా, ఆర్థిక సంక్షోభాలు ఎదురైనప్పుడు ఇప్పటికీ ప్రపంచం నమ్మే ఏకైక ఆస్తి బంగారమేనని ఈ నిల్వలు నిరూపిస్తున్నాయి.