Reading Time: < 1 minute
Telangana: తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం.. 100మందికి పైగా ప్రముఖులకు..

తెలంగాణలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నక్సల్స్, తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ప్రముఖులకు అందిస్తున్న భద్రతను పునఃసమీక్షించింది. భద్రతా సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకు అవసరం లేని వారికి గన్‌మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికిపైగా ప్రముఖుల భద్రతను తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల సమావేశమైన భద్రతా సమీక్ష కమిటీ, ఇంటెలిజెన్స్ విభాగం సమర్పించిన నివేదికను పరిశీలించింది. ప్రస్తుతం ఎవరెవరికి భద్రత కొనసాగించాలి, కొత్తగా ఎవరికి భద్రత కల్పించాలి, ఎవరికి ఎంత స్థాయిలో భద్రత అవసరమనే అంశాలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులు, ముప్పు అంచనాలు, ఇంటెలిజెన్స్ నివేదికలను ఆధారంగా చేసుకుని ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నిర్ణయంతో భద్రత అవసరం లేదని భావించిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ పోలీసు ఉన్నతాధికారులకు కేటాయించిన గన్‌మెన్లను ఉపసంహరించనున్నారు. అలాగే ప్రభుత్వం కల్పించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను కూడా కొందరి నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చాలాకాలంగా భద్రత పొందుతున్న పలువురు ప్రముఖుల భద్రతా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 600 మంది ప్రముఖులకు ఇంటెలిజెన్స్ విభాగం భద్రత కల్పిస్తోంది. అయితే తాజా సమీక్ష అనంతరం అవసరం లేని వారికి భద్రత కొనసాగించడం కంటే, నిజంగా ముప్పు ఉన్న వారికి మాత్రమే భద్రత కల్పించాలనే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పోలీసు సిబ్బంది వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటంతో పాటు భద్రతా వ్యవస్థలో సమర్థత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు మావోయిస్టులు మినహా పెద్దగా ఎవరూ ప్రస్తుతం అజ్ఞాతంలో లేరని, నక్సల్స్ ప్రభావం కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన మాజీ అధికారులు, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు కల్పిస్తున్న భద్రతను కూడా ఉపసంహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.