
Oscars Academy : భారతీయ సినిమా ప్రపంచానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన అసాధారణ ప్రతిభతో భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఇప్పుడు ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపును అందుకున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన ఆయనకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి సభ్యత్వ ఆహ్వానం రావడం భారతీయ సినిమాకు మరో గర్వకారణంగా నిలిచింది. అకాడమీ సభ్యత్వం సాధించడం అంటే కేవలం గౌరవం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డుల నామినేషన్లు, విజేతలను ఎంపిక చేసే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే హక్కు కూడా దానితో లభిస్తుంది. ప్రపంచ సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖ కళాకారులు, సాంకేతిక నిపుణులకు మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ కూడా ఆ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించారు.
1983లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీకర్ ప్రసాద్ ఇప్పటివరకు 17 భారతీయ భాషల్లో 650కు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఈ అరుదైన ఘనతతో ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు అనేక భాషల్లో ఆయన చేసిన చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. శ్రీకర్ ప్రసాద్ ప్రతిభకు ఇప్పటివరకు 9 జాతీయ చలనచిత్ర అవార్డులు దక్కాయి. అందులో 7 సార్లు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డు అందుకుని ఈ విభాగంలోనే అరుదైన రికార్డు నెలకొల్పారు. 2026 సంవత్సరానికి అకాడమీ ఆహ్వానించిన ప్రపంచవ్యాప్తంగా 529 మంది కొత్త సభ్యుల జాబితాలో ఆయన పేరు చోటు దక్కించుకోవడం భారతీయ సినీ సాంకేతిక నిపుణుల ప్రతిభకు ప్రపంచ స్థాయిలో లభిస్తున్న గుర్తింపుకు నిదర్శనం. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన ప్రపంచవ్యాప్త విజయానంతరం భారతీయ సినిమా సాంకేతిక నైపుణ్యాలపై అంతర్జాతీయ వేదికల్లో పెరుగుతున్న ఆదరణకు శ్రీకర్ ప్రసాద్ అందుకున్న ఈ గౌరవం మరో మైలురాయిగా నిలిచింది.