
పైసా పెట్టుబడి లేకుండా.. రోజుకు కేవలం 3 గంటలు కష్టపడితే నెలకు రూ.70 వేలు సంపాదించొచ్చా..? “అవును, ఈజీగా సంపాదించవచ్చు” అని నిరూపించాడు ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. రిషికేశ్ పుణ్యక్షేత్రంలో అతను చేసిన ఒక వింత ‘సోషల్ ఎక్స్‌పెరిమెంట్’ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఒక నుదుటి బొట్టుతో అతను చేసిన మ్యాజిక్ ఏంటో చూద్దాం..
అసలేం చేశాడు అంటే
‘తానీ ఠాకూర్’ అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ సాంప్రదాయ బట్టలు వేసుకుని, చేతిలో ఒక పూజా పళ్లెం, అందులో తిలకం (బొట్టు) పట్టుకుని రిషికేశ్ వీధుల్లోకి దిగాడు. దారిపోయే అపరిచితులకు, భక్తులకు నుదుటిపై బొట్టు పెట్టడం ప్రారంభించాడు.
మొదటి గంటలో చాలా మంది అతను బొట్టు పెడుతుంటే వద్దంటూ నిరాకరించారు. ఎలాగోలా కేవలం 20 మందికి మాత్రమే బొట్టు పెట్టగలిగాడు. అప్పటివరకు అతని పళ్లెంలో ఒక్క రూపాయి కూడా పడలేదు. ఈ పని వల్ల మహా అయితే ఒక యాభై, అరవై రూపాయలు వస్తాయేమో అనుకున్నాడు. కానీ, అసలు ట్విస్ట్ ‘గంగా హారతి’ సమయంలో పడింది!
గంగా హారతి వేళ.. తిరిగిన అదృష్టం
సాయంత్రం గంగా హారతి జరిగే ఘాట్ దగ్గరికి వెళ్లగానే సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ ఉన్న భక్తులు ఇతన్ని చూసి నిజమైన పూజారి లేదా దైవభక్తుడు అనుకున్నారు. ఇంకేముంది.. పోటీ పడి మరీ బొట్టు పెట్టించుకున్నారు. ఎవరికి వారు భక్తితో రూ.10, రూ.20 ఇస్తే.. కొందరైతే ఏకంగా రూ.100 నోట్లు కూడా ఇచ్చారు.
కేవలం 3 గంటల్లో సుమారు 400 మందికి అతను తిలకం పెట్టాడు. అంతా అయిపోయాక లెక్కేసుకుంటే.. అతని పళ్లెంలో ఏకంగా రూ.2,350 తేలాయి.
నెలకు 70 వేలు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
రోజుకు కేవలం 3 గంటలు ఇలా బొట్టు పెడితే.. నెలకు అక్షరాలా రూ.70,000 సంపాదించొచ్చు అంటూ అతను పెట్టిన వీడియో సోషల్ మీడియాలో 40 లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే వేసవి సెలవుల్లో నా ఇంటర్న్‌షిప్ ప్లాన్ దొరికేసింది అని ఒకరు జోక్ చేయగా.. ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తారా అని ఇంకొకరు కామెంట్ చేశారు.
మన దేశంలో మతం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది.. పెట్టుబడి లేని బెస్ట్ బిజినెస్ ఇదే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, భక్తిని క్యాష్ చేసుకోవడం ఎంత ఈజీనో చూపించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టంట తెగ హల్‌చల్ చేస్తోంది.