
NPS Premature Exit: జాతీయ పింఛను వ్యవస్థ (NPS)లో పెట్టుబడి పెట్టిన వారు గడువు పూర్తికాకముందే తమ డబ్బును ఎలా ఉపసంహరించుకోవచ్చనే విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్ల వయస్సు రాకముందే NPS ఖాతాను మూసివేసి మొత్తం నిధులను తిరిగి పొందవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది సాధ్యమే.
గతంలో పాత పన్ను విధానంలో సెక్షన్ 80CCD(1B) కింద NPSలో రూ.50,000 వరకు పెట్టుబడులకు అదనపు ఆదాయపు పన్ను మినహాయింపు లభించడంతో ప్రైవేట్ రంగ ఉద్యోగులు పెద్దఎత్తున ఈ పథకంలో పెట్టుబడులు పెట్టారు. అయితే, కొత్త పన్ను విధానం అమలులోకి రావడంతో పాటు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెరగడం వల్ల చాలా మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో NPSలో పెట్టుబడులు కొనసాగించని వారు ఇప్పుడు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
సాధారణంగా NPSను దీర్ఘకాలిక పదవీ విరమణ పథకంగా భావిస్తారు. అందువల్ల 60 ఏళ్ల వరకు డబ్బు పూర్తిగా లాక్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అవసరమైతే ఖాతాను ముందుగానే మూసివేసి, నిబంధనల ప్రకారం నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
రూ.2.5 లక్షల వరకు పూర్తి ఉపసంహరణకు అవకాశం
PFRDA నిబంధనల ప్రకారం, NPS ఖాతాను గడువుకు ముందే మూసివేసే సమయంలో ఖాతాలో వడ్డీతో కలిపి మొత్తం బ్యాలెన్స్ రూ.2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, మొత్తం నిధిని ఒకేసారి 100 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఈ సందర్భంలో యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, ఖాతాలోని మొత్తం నిధి రూ.2.5 లక్షలను మించి ఉంటే పూర్తి మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో మొత్తం నిధిలో కనీసం 80 శాతాన్ని యాన్యుటీ కొనుగోలుకు కేటాయించాలి. మిగిలిన గరిష్టంగా 20 శాతం మొత్తాన్ని మాత్రమే నగదు రూపంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
రూ.5 లక్షల పరిమితిపై ఉన్న గందరగోళం
చాలామంది రూ.5 లక్షల వరకు పూర్తి ఉపసంహరణ సౌకర్యాన్ని అకాల నిష్క్రమణకు కూడా వర్తిస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది సరైన అవగాహన కాదు. రూ.5 లక్షల వరకు పూర్తి విత్‌డ్రా అవకాశం 60 ఏళ్ల వయస్సు పూర్తయ్యాక జరిగే సాధారణ నిష్క్రమణకు మాత్రమే వర్తిస్తుంది. గడువుకు ముందే ఖాతాను మూసివేస్తే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే పరిమితి రూ.2.5 లక్షలు మాత్రమే.
దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే డబ్బు
ప్రస్తుతం NPS ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో, పేపర్‌లెస్ విధానంలో అందుబాటులో ఉంది. అవసరమైన వివరాలతో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత సాధారణంగా మూడు పని దినాల్లోనే డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేయాలి
* PRAN నంబర్, పాస్‌వర్డ్‌తో CRA (ప్రొటీన్) పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వాలి.
* Manage Your Withdrawal ఎంపికపై క్లిక్ చేసి Exit from NPS విభాగంలో Initiate Requestను ఎంచుకోవాలి.
* అక్కడ Premature Exit ఎంపికను సెలెక్ట్ చేయాలి.
* అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రద్దు చేసిన చెక్ లేదా పాస్‌బుక్ కాపీ వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
* చివరగా నమోదిత మొబైల్‌కు వచ్చిన OTP లేదా ఆధార్ ఈ-సైన్ ద్వారా దరఖాస్తును ధృవీకరించి సమర్పించాలి.
NPSలో పెట్టుబడి పెట్టిన సభ్యులు అకాల నిష్క్రమణకు ముందు తమ ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్, వర్తించే నిబంధనలు, అలాగే యాన్యుటీ కొనుగోలు తప్పనిసరి అయ్యే పరిస్థితులను ముందుగానే తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.